Matrix Prasad: మ్యాట్రిక్స్ ప్రసాద్ గా తెలుగువారందరికీ సుపరిచితమైన నిమ్మగడ్డ ప్రసాద్ మరోసారి వార్తల్లో నిలిచారు. దాదాపు 17 ఏళ్ల అనంతరం తిరిగి ఫార్మా రంగంలోకి ప్రవేశించనున్నారు. అదికూడా తాను గతంలో విక్రయించిన కంపెనీని తిరిగి సాధించి మరీ రీస్టార్ట్ కు రెడీ అయ్యారు.
తన ఇండియన్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్(API) వ్యాపారాన్ని విక్రయించినట్లు వయాట్రిస్ తెలిపింది. 2006లో మైలాన్ కు ఈ బిజినెస్ ను నిమ్మగడ్డ ప్రసాద్ విక్రయించగా.. తిరిగి ఇదే వ్యాపారాన్ని ఆయన కంపెనీ ఐక్వెస్ట్ ఎంటర్ ప్రైజెస్ దక్కించుకున్నట్లు పేర్కొంది.

వియాట్రిస్ నిర్వహించిన అంతర్జాతీయ బిడ్డింగ్‌లో తమ సంస్థ ప్రాధాన్య ఇన్వెస్టర్‌గా నిలిచిందని ఐక్వెస్ట్ ప్రకటించింది. హైదరాబాద్, విశాఖపట్నంలలో చెరొక 3 చొప్పున మొత్తం 6 API తయారీ యూనిట్లు ఐక్వెస్ట్ యాజమాన్యంలోకి రానున్నాయి. భాగ్యనగరంలోని పరిశోధన, అభివృద్ధి యూనిట్ కూడా ఐక్వెస్ట్ పరం కానుంది. అయితే ఈ డీల్ విలువ తెలియాల్సి ఉంది.
ఈ 6 ప్లాంట్ల నుంచి ఏడాదికి సుమారు 6 వేల కోట్ల వరకు ఆదాయం రావచ్చని అంచనా. ఇందులో తయారైన ఉత్వత్తులను 10 ఏళ్లపాటు కొనుగోలు చేసేందుకు వియాట్రిస్ అంగీకరించింది. ఈ డీల్ పూర్తి కావడానికి 6 నెలల సమయం పడుతుంది. కాగా రానున్న రోజుల్లో మ్యాట్రిక్స్ ప్రసాద్ మరోసారి తన మార్కు డెవలప్ మెంట్ చూపిస్తారని ఫార్మా వర్గాలు భావిస్తున్నాయి.
మ్యాట్రిక్స్ లాబొరేటరీస్, కేర్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులుగా నిమ్మగడ్డ ప్రసాద్ కు మంచి పేరుంది. ఇబ్బందుల్లో ఉన్న మ్యాట్రిక్స్ ల్యాబ్స్ ను కొనుగోలు చేసి కేవలం 6 ఏళ్లలోనే బిలియన్ డాలర్ల కంపెనీగా తీర్చిదిద్దారు. అనంతరం 2006లో 1.1 బిలియన్ డాలర్లకు దీనిని మైలాన్ ఇంక్ కు విక్రయించారు. తదనంతర డీల్స్ లో పేరుమార్చుకున్న కంపెనీ.. ప్రస్తుతం వియాట్రిస్ గా కొనసాగుతోంది. దీన్ని ఇప్పుడు తిరిగి హస్తగతం చేసుకున్నారు.


Click it and Unblock the Notifications