14 ఏళ్ల తర్వాత ధరలు పెరుగుతున్నాయి, అగ్గిపెట్టె డిసెంబర్ నుండి డబుల్
పద్నాలుగేళ్ల తర్వాత అగ్గిపెట్టే ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు అగ్గిపెట్టేలు రూ.1కి విక్రయిస్తోన్న విషయం తెలిసిందే. అగ్గిపెట్టే ధరను డిసెంబర్ 1వ తేదీ నుండి రూ.2 చొప్పున విక్రయిస్తామని తయారీ కంపెనీలు వెల్లడిస్తున్నాయి. అగ్గిపుల్లల తయారీలో వినియోగించే 14 రకాల ముడి పదార్థాల ధరలు పెరగడమే ఇందుకు కారణమని వివరించాయి. సాధారణంగా రూపాయికి దొరికే వస్తువుల పేర్లు చెప్పమంటే అందులో అగ్గిపెట్టే ముందు ఉంటుంది. ప్రతి ఇంట్లో అత్యవసరమైన వస్తువుల్లో అగ్గిపెట్టే ఒకటి అని చెప్పవచ్చు. ఇలాంటి అగ్గిపెట్టే ధర పద్నాలుగేళ్లుగా రూ.1గానే ఉంటుంది. అయితే ఈ ధరను ఇప్పుడు రూ.2కు పెంచాలని తయారీ సంస్థలు నిర్ణయించాయి.

అందుకే ధరల పెంపు
తయారీ ముడి సరుకుల్లో చాలా వాటి ధరలు భారీగా పెరిగాయి. దీంతో ధరను పెంచడం తప్ప మరో మార్గం లేదని చెబుతున్నారు తయారీదారులు. ఇటీవలి వరకు రూ.425గా ఉన్న రెడ్ ఫాస్ఫరస్ ధర ఇప్పుడు రూ.810కి పెరిగింది. అలాగే మైనం ధర రూ.58 నుండి రూ.80కి చేరుకుంది. ఔటర్ బాక్స్ బోర్డు రూ.36 నుండి రూ.55కి, ఇన్నర్ బాక్స్ బోర్డు రూ.32 నుండి రూ.58కి పెరిగింది.
బాక్స్ బోర్డులు, పేపర్, పొటాషియం క్లోరేట్, గంధకం వంటి 14 రకాల ముడిపదార్థాల ధరలు కూడా పెరిగాయి. ఇంధన ధరలు భారీగా పెరగడం వల్ల రవాణా ఛార్జీలు కూడా పెరిగాయని చెబుతున్నారు. దీంతో అగ్గిపెట్టే ధరలు పెంచవలసిన పరిస్థితి ఉందని అంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు గత రెండేళ్ల కాలంలో 35 శాతం వరకు పెరిగాయి. అలాగే, ధరలు పెంచక కూడా దాదాపు దశాబ్దంన్నర అవుతోంది.

ధరలు భారీగా పెంపు
అగ్గిపెట్టె ధరలు చివరిసారి 2007లో పెరిగాయి. అంతకుముందు రూ.0.50 (అర్దరూపాయి)గా ఉన్న ఈ ధరలు రూ.1కి పెరిగాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు పెంచుతున్నారు. ఇప్పటి వరకు 600 అగ్గిపెట్టెల బాక్సును రూ.270 నుండి రూ.300కు తయారీదారులు విక్రయిస్తుండగా, ఇక నుండి రూ.430 నుండి రూ.480కి పెంచాలని అగ్గిపెట్టే తయారీదారులకు సంబంధించిన 5 సంఘాలు శివకాసీలో సమావేశమై నిర్ణయించాయి.
ధరలు దాదాపు ఒకటిన్నర రెట్లకు పెంచుతున్నట్లు నేషనల్ స్మాల్ మ్యాచ్ బాక్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తెలిపింది. దీనికి అదనంగా 12 శాతం జీఎస్టీ, రవాణా ఛార్జీలు ఉంటాయని తెలిపింది. తమిళనాడులో అగ్గిపెట్టేల తయారీ పరిశ్రమపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.

అగ్గిపెట్టెల ధరల పెంపు చాలా రేర్
అగ్గిపెట్టెల ధరలు చాలా తక్కువగా పెరుగుతుంటుంది. ఒకసారి పెరిగితే పదిపదిహేనేళ్ల వరకు మళ్లీ పెరుగుదల ఉండదు. అయితే ఖర్చులు పెరుగుతున్నాకొద్దీ అగ్గిపెట్టెలో క్వాంటిటీ మాత్రం తగ్గుతుంది. కానీ ధరలు పెరగడం మాత్రం చాలా ఏళ్లకు ఒకసారి ఉంటుంది. క్రితంసారి 2007లో రూ.0.50 ఉన్న అగ్గిపెట్టె ధర రూ.1కి పెరిగింది. అంతకుముందు 1995లో రూ.0.25 పైసలుగా ఉన్న అగ్గిపెట్టే రూ.0.50 పైసలకు పెరిగింది.


Click it and Unblock the Notifications