IPO News: ఈవారం దేశీయ స్టాక్ మార్కెట్లలోకి అనేక కంపెనీల ఐపీవోలు అరంగేట్రం చేశాయి. అయితే నేడు లిస్టింగ్ జరిగిన ఐపీవో మాత్రం ఇన్వెస్టర్ల ఆశలపై నీళ్లు చల్లింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది మాస్టర్ కాంపోనెంట్స్ కంపెనీ ఐపీవో గురించే. ఇది ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో జాబితా చేయబడింది. శుక్రవారం షేర్ల లిస్టింగ్ చాలా మందకొడిగా జరిగింది. ఐపీవో ధర అయిన రూ.140 కంటే స్వల్పంగా 0.28% అధిక ధరకు మార్కెట్లోకి అడుగుపెట్టాయి. దీంతో మంచి లాభాలను ఆశించిన ఇన్వెస్టర్లు నిరాశకు గురయ్యారు.

ఐపీవో కోసం ఒక్కో లాటులో 1000 షేర్ల చొప్పున కంపెనీ విక్రయించింది. మాస్టర్ కాంపోనెంట్స్ తన IPO ద్వారా రూ.15.43 కోట్లను మార్కెట్ల నుంచి సమీకరించింది. ఈ ఐపీవోలో మెుత్తంగా 7 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించింది. దీని ద్వారా రూ.9.80 కోట్లను సమీకరించింది. అలాగే ఆఫర్ ఫర్ సేల్ రూపంలో 4.02 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించి రూ.5.63 కోట్లను సేకరించింది. ఐపీవో ద్వారా వచ్చిన సొమ్మును కార్పొరేట్ లక్ష్యాలు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం వినియోగించాలని నిర్ణయించింది.
కంపెనీ ప్రధానంగా మౌల్డింగ్ వ్యాపారంలో ఉంది. ఎలక్ట్రికల్, ఇండస్ట్రియల్, మెడికల్, ఆటోమోటివ్ రంగాల ఉత్పత్తులకు అవసరమైన కాంపొనెంట్స్ తయారీ వ్యాపారంలో కంపెనీ ఉంది. ఈ రంగంలో ఇప్పటికే గట్టి పోటీ ఉన్నందున కొన్ని బ్రోకరేజీలు ఈ ఐపీవోను కొనుగోలు చేయకుండా ఉంచే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అందువల్ల గ్రేమార్కెట్లో కంపెనీ షేర్లకు ఎలాంటి ప్రీమియం కూడా పలకలేదు. మెుత్తానికి అన్ని ఐపీవోల మాదిరిగానే మంచి లాభాలను ఈ ఐపీవో అందిస్తుందని ఇన్వెస్టర్లు భావించినప్పటికీ.. వారి ఆశలు చిగురించలేదు.


Click it and Unblock the Notifications