Maruti Suzuki: ఈ రోజుల్లో ఆర్థిక స్థోమత పెరిగినప్పటికీ దేశంలో ఇంకా చాలా మంది కార్లను కొనటానికి విముకతగానే ఉన్నారు. దీనికి ఉన్న అనేక కారణాల్లో ఒక ముఖ్యమైనది కేంద్ర ప్రభుత్వం వాటిపై విధిస్తున్న అధిక పన్నులు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని మారుతీ సుజుకీ ఇండియా ప్రెసిడెంట్ ఆర్‌సి భార్గవ అన్నారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందిని తెరమీదకు తెచ్చారు.

క్షీణించిన వృద్ధి..
కేంద్ర ప్రభుత్వం పన్ను విధానాల్లో కార్లను ప్రజలు ఉపయోగించే విలాసవంతమైన వస్తువుగా పరిగణిస్తోందని భార్గవ అన్నారు. కానీ మారిన కాలంతో పాటు అది సాధారణ అవసరాల్లో భాగంగా మారినట్లు గుర్తుచేశారు. వీటిపై విధిస్తున్న అధిక టాక్సుల విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు. భారతదేశంలో గడచిన 12 ఏళ్ల కాలంలో కార్ల రంగం 12 శాతం నుంచి 3 శాతానికి క్షీణించిందని ఆయన వెల్లడించారు. దీనికి ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానమే ప్రధాన కారణంగా ఆయన ఎత్తి చూపారు.

యూనిఫామ్ టాక్స్ సరికాదు..
మోదీ సర్కార్ వృద్ధిని ప్రోత్సహించేందుకు కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆటో రంగంలో వృద్ధి వెనుకబడి ఉందని భార్గవ్ అన్నారు. చిన్న కార్లపై లోడ్ చాలా ఎక్కువగా ఉందని ఇది పరిశ్రమకు మంచిది కాదన్నారు. కేంద్రం చిన్న తరహా లేదా ఖరీదైన కార్లకు ఒకే టాక్స్ విధానాన్ని అమలు చేయటం ఇక్కడ అతిపెద్ద సమస్యగా ఉందని పరిశ్రమ భావిస్తోందన్నారు. అందుకే చిన్న కార్ల సెగ్మెంట్ దేశంలో పెద్దగా వృద్ధి చెందలేదని పేర్కొన్నారు.

భారీగా టాక్సులు..
కేంద్రం ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంపై 28% జీఎస్టీ విధిస్తోంది. దీనికి తోడు కారు మోడల్ ఆధారంగా సెస్ 1-22% వరకు ఉంటోంది. దిగుమతి చేసుకునే కార్లకు సైతం ఇదే పన్ను వర్తిస్తోందని వెల్లడించారు. 40 వేల డాలర్ల కంటే తక్కువ ధర ఉన్న కార్లకు 60 శాతం టాక్స్ ఉండగా.. అంతకంటే ఖరీదైన కార్లపై 100 శాతం సుంకాన్ని భారత ప్రభుత్వం వసూలు చేస్తోంది. అదే విధంగా దేశంలో ఎలక్ట్రిక్ కార్లను ప్రమోట్ చేయటంలో భాగంగా కేంద్రం వాటిపై కేవలం 5 శాతం పన్నును విధిస్తోంది.

పొరుగు దేశాల్లో అభివృద్ధి
యూరప్, జపాన్ వంటి అభివృద్ధి చెందిన మార్కెట్లతో పోలిస్తే తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉందని, భారత్‌లో కార్లపై పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అలాగే కేంద్రం అధిక పన్నులు విధిస్తున్నందునే టెస్లా తన కార్లను భారత మార్కెట్లోకి తీసుకురాలేకపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉపాధి అవకాశాలను భారీగా కల్పిస్తున్న భారత ఆటోమొబైల్ రంగంలో వృద్ధిని ప్రోత్సహించడానికి పన్ను తగ్గింపు అవసరమని భార్గవ అన్నారు. ఈ సారి బడ్జెట్ లో నైనా కేంద్రం పరిశ్రమ వర్గాల ఆకాంక్షలను పట్టించుకుంటుందా అనే విషయం వేచిచూడాల్సిందే.


Click it and Unblock the Notifications