Settlement Cycle: మార్కెట్లలో కొత్త జోష్.. రేపటి నుంచే కీలక మార్పుకు శ్రీకారం..
T+0 Settlement: సెటిల్‌మెంట్ సైకిల్‌ను అంచలంచెలుగా కుదించేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ నిర్ణయం తీసుకుంది. గతంలో T+5 నుంచి T+3, T+2 అనంతరం అదేరోజు సెటిల్‌మెంట్ దిశగా అడుగులు వేసింది. తాజాగా దీనిపై దేశీయ పురాతన స్టాక్ ఎక్స్ఛేంజ్ BSE కీలక అప్‌డేట్ ఇచ్చింది.
రేపటి నుంచి T+0 సెటిల్‌మెంట్ సైకిల్ అమలు చేయనున్నట్లు BSE ప్రకటించింది. ఇందుకు అర్హత సాధించిన 25 స్టాక్‌ల జాబితాను విడుదల చేసింది. భారతీయ మార్కెట్లు ప్రస్తుతం T+1 సెటిల్‌మెంట్ సైకిల్‌పై పనిచేస్తున్నాయి. అంటే లావాదేవీ జరిగిన ఒక రోజు తర్వాత పెట్టుబడిదారుల డీమ్యాట్ ఖాతాలలో షేర్ల కొనుగోలు లేదా విక్రయాలు రిఫ్లెక్ట్ అవుతాయి. కాగా ఇప్పుడు అవి అదేరోజు ప్రతిబింబించేలా మార్పులు జరిగాయి.

ఈ నెల ప్రారంభంలో క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ ఐచ్ఛిక ప్రాతిపదికన T+0 ట్రేడ్ సెటిల్‌మెంట్ సైకిల్ కు అంగీకారం తెలిపింది. బీటా వెర్షన్‌ను పరిచయం చేయడానికి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను సైతం రూపొందించింది. మొదటగా 25 పరిమిత స్టాక్స్ మరియు బ్రోకర్లతో దీన్ని ప్రారంభించనుంది. ఈక్విటీ క్యాష్ మార్కెట్‌లో ప్రస్తుతం ఉన్న T+1 సెటిల్‌మెంట్ సైకిల్‌కు ఇది అదనమని గమనించాలి.
త్వరిత సెటిల్‌మెంట్ సైకిల్ వల్ల ఖర్చు మరియు సమయం రెండూ ఆదా అవుతాయని సెబీ పేర్కొంది. మార్కెట్ల సామర్థ్యాన్ని, పెట్టుబడిదారులకు ఛార్జీలలో పారదర్శకతను తీసుకువస్తుందని అభిప్రాయపడింది. ముఖ్యంగా క్లియరింగ్ కార్పొరేషన్‌లు మరియు మొత్తం సెక్యూరిటీల మార్కెట్ పర్యావరణ వ్యవస్థలో రిస్క్ మేనేజ్‌మెంట్‌ను బలోపేతం చేస్తుందని యోచిస్తోంది.
మొదటి దశలో T+0 సెటిల్‌మెంట్ సైకిల్ ఈ 25 స్టాక్స్‌లో అమలు కానుంది. అంబుజా సిమెంట్స్, అశోక్ లేలాండ్, బజాజ్ ఆటో, బ్యాంక్ ఆఫ్ బరోడా, BPCL, బిర్లాసాఫ్ట్ లిమిటెడ్, సిప్లా, కోర్జ్ లిమిటెడ్, దివీస్ లాబొరేటరీస్, హిండాల్కో, ఇండియన్ హోటల్స్, JSW స్టీల్, LIC హౌసింగ్ ఫైనాన్స్, LTIMINDTREE, MRF, NESTLE INDIA, NMDC, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, పెట్రోనెట్ LNG LTD, సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, SBI, టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్, TRENT LTD, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వేదాంత LTDలు ఇందులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications