ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (ఏప్రిల్ 13) నష్టాల్లో ప్రారంభమై, నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం గం.9.20 సమయానికి సెన్సెక్స్ 216.69 పాయింట్లు (0.70%) నష్టపోయి 30,942.93 వద్ద, నిఫ్టీ 54.75 పాయింట్లు కోల్పోయి (0.60%) 9,057.15 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. 836 షేర్లు లాభాల్లో, 394 షేర్లు నష్టాల్లో ఉండగా, 73 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. మెటల్, ఫార్మా రంగాలు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాలు ఒత్తిడిలో ఉన్నాయి.
ఆ తర్వాత కాసేపటికే సెన్సెక్స్ ఏకంగా 630 పాయింట్లు నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్ల ఒడిదుడుకులు, ఎఫ్‌పీఐలు పెద్ద ఎత్తున వెనక్కి వెళ్లడం, లాక్ డౌన్ పైన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఇంకా రాకపోవడం, చమురు ఉత్పత్తులపై ఒపెక్, ఉత్పత్తి దేశాల మధ్య ఒప్పందం వంటి వివిధ అంశాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో HDFC, భారతీ ఎయిర్‌టెల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్, సిప్లా, లార్సెన్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో జీఎంటర్టైన్మెంట్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్ కంపెనీ, మారుతీ సుజుకీ ఉన్నాయి.
ఉదయం నుండి నష్టాల్లోనే ఉన్న మార్కెట్లు చివరకు అంతే నష్టాల్లో ముగిశాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలత ప్రభావంతో సెన్సెక్స్ 470 పాయింట్ల నష్టంతో 30,690 వద్ద, నిఫ్టీ 118 పాయింట్ల నష్టంతో 8,994 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. డాలరుతో రూపాయి మారకం 76.27 వద్ద క్లోజ్ అయింది. ఆటో, రియాల్టీ, బ్యాంకింగ్ షేర్లు నష్టపోయాయి.


Click it and Unblock the Notifications