ముంబై: మార్కెట్లకు స్వల్ప ఊరట. నిన్నటి వరకు వరుసగా భారీ నష్టాలు చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కోలుకున్నాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమై ఆ తర్వాత ఊగిసలాడుతూ.. చివరకు లాభాల్లోకి వచ్చాయి. ఉదయం గం.09:19 సమయానికి సెన్సెక్స్ 184.04 పాయింట్లు (0.65%) ఎగిసి 28,472.27 వద్ద, నిఫ్టీ 62.05 పాయింట్లు (0.75%) లాభపడి 8,325.50 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. కానీ ఆ తర్వాత లాభాల్లోకి వెళ్తూ.. నష్టాల్లోకి జారుకుంటూ కనిపించింది. ఓ సమయంలో సెన్సెక్స్ 30,380 పాయింట్లకు చేరుకుంది. చివరకు సెన్సెక్స్ 1,627.73 (5.75%) పాయింట్లు ఎగిసి 29,915.96 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 482 పాయింట్ల లాభంతో 8,745 వద్ద ముగిసింది.

రెండు నెలలకు ముందు.. తర్వాత
జనవరి 20వ తేదీన సెన్సెక్స్ రికార్డ్ హైకి చేరుకుంది. సెన్సెక్స్ 42,273 పాయింట్లకు, నిఫ్టీ 12,430 పాయింట్లతో ఆల్ టైమ్ హైగా నిలిచింది. ఆ తర్వాత కరోనా వైరస్ దెబ్బతో రోజు రోజుకు పడిపోయాయి. నిన్నటి వరకు (మార్చి 19) సెన్సెక్స్ 13,985 పాయింట్లు, నిఫ్టీ 4,167 పాయింట్లు నష్టపోయింది.

రెండు నెలల్లో రూ.51 లక్షల కోట్ల సంపద
ఈ రెండు నెలల కాలంలో.. నిన్నటి వరకు ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్లు ఆవిరైంది. ఆల్ టైమ్ హై నుండి గురువారం వరకు రూ.51 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. గత రెండు వారాల్లోనే రూ.20 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.

బడ్జెట్ అనంతరం..
ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు సెన్సెక్స్ 988 పాయింట్లు నష్టపోయింది. అప్పుడు 39,735 వద్ద నిలిచింది. నిఫ్టీ 300 పాయింట్లు దిగజారి 11,661 వద్ద క్లోజ్ అయింది. బడ్జెట్ అనంతరం ఫిబ్రవరి 12న సెన్సెక్స్ 41,566కు చేరుకుంది. ఆ రోజు నుండి మార్చి 19 నాటికి సెన్సెక్స్ 13,278 పాయింట్లు నష్టపోయింది. ఈ రోజు స్వల్ప ఊరట దక్కింది.


Click it and Unblock the Notifications