ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. కరోనా వైరస్ భయాల కారణంగా గత వారం భారత్, అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ రోజు కూడా నష్టాలనే మూటగట్టుకున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ చివరకు నష్టాలు చవిచూశాయి. ఉదయం గం.9.45 సమయానికి సెన్సెక్స్ 559 పాయింట్లు ఎగిసింది. నిఫ్టీ 167 పాయింట్లు పెరిగింది. కానీ మార్కెట్లు క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్ 153 పాయింట్లు నష్టపోయి 38,144 వద్ద, నిఫ్టీ 69 పాయింట్లు పడిపోయి 11,132 వద్ద ముగిసింది.
ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు.. భారత్‌లో రెండు కరోనా వైరస్‌లు గుర్తించడంతో మళ్ళీ నష్టాల్లోకి జారుకున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.42 వద్ద ఉంది. టాప్ గెయినర్స్ జాబితాలో హెచ్‌సీఎల్ టెక్, ఐచర్ మోటార్స్, నెస్ట్లే, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో యస్ బ్యాంకు, ఎస్బీఐ, టాటా స్టీల్, గెయిల్, హిండాల్కో ఉన్నాయి.

సోమవారం వందలాది షేర్లు 52 వారాల కనిష్టానికి చేరుకున్నాయి. తొలుత షార్ట్ కవరింగ్‌కు దిగడంతో పాటు ఇన్వెస్టర్లు ఎంపిక చేసిన కౌంటర్లలో కొనుగోళ్లు చేపట్టడంతో మార్కెట్లు కళకళలాడాయి. సెన్సెక్స్ 786 పాయింట్లు జంప్, 39,000 పాయింట్ల మార్కును అధిగమించింది. అంటే ఓ సమయంలో భారీగా ఎగిసిన సెన్సెక్స్.. ఆ తర్వాత 153 పాయింట్ల నష్టంతో ముగియడంతో.. ఈ ఒక్కరోజు వెయ్యికి పైగా పాయింట్లపైకి ఎగిసి, అంతే మొత్తం పడిపోయింది. నిఫ్టీ 220 పాయింట్లు ఎగిసి 11,433 వద్దకు చేరుకుంది. అయితే రెండు కరోనా కేసులు నమోదైనట్లు వెలువడిన వార్తలు మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీశాయి. దీంతో పతనమయ్యాయి.


Click it and Unblock the Notifications