దెబ్బకొట్టిన కరోనా: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ ట్రేడింగ్ నిలిపివేత
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ కారణంగా గత కొంతకాలంగా జాతీయ, అంతర్జాతయ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఈ రోజు (మార్చి 23) మార్కెట్లు అతి భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.19 సమయానికి సెన్సెక్స్ 2,600 పాయింట్ల నష్టంతో ప్రారంభం కాగా, నిఫ్టీ 8,000 పాయింట్ల దిగువతో ప్రారంభమైంది. డాలర్ మారకంతో రూపాయి 76 మార్క్ చేరుకుంది.
సెన్సెక్స్ 2,991 పాయింట్లు అంటే దాదాపు మూడువేల పాయింట్లు కూడా నష్టపోయింది. సెన్సెక్స్ 10 శాతం లోయర్ సర్క్యూట్‌కు చేరుకోవడంతో ట్రేడింగ్‌ను 45 నిమిషాల పాటు నిలిపివేశారు. ఆ తర్వాత ట్రేడింగ్ ప్రారంభమైనప్పటికీ మార్కెట్లు కోలుకోలేదు. సెన్సెక్స్ 3,500 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 7,900 పాయింట్ల దిగువకు చేరుకుంది.

బజాజ్ ఆటో, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనీలీవర్, ఎల్ అండ్ టీ, హెచ్‌సీఎల్ టెక్, ఎస్బీఐ, అల్ట్రా సిమెంట్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, నెస్ట్లె, ఐటీసీ, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, టీసీఎస్, ఏషియన్ పేయింట్స్, కొటక్ బ్యాంకు, భారతీ ఎయిర్ టెల్, టాటా స్టీల్, హీరో మోటో కార్ప్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్ ఇండి బ్యాంకు, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు, పవర్ గ్రిడ్.. ఇలా అన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. అన్ని రంగాలు కూడా నష్టాల్లోనే ఉన్నాయి.
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటిస్తున్నాయి. ఆదివారం జనతా కర్ఫ్యూ నిర్వహించాయి. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు పెరుగుతున్నాయి. దీంతో మార్కెట్లకు భయం పట్టుకుంది. ప్రారంభంలోనే భారీ నష్టాల్లోకి వెళ్లిపోయాయి.


Click it and Unblock the Notifications