ఆర్బీఐ ప్రకటన తర్వాత నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు, బలపడిన రూపాయి
ముంబై: ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన నేపథ్యంలో ఉదయం నుండి లాభాల్లో ఉన్న మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం లాభాల్లోకి వచ్చిన సెన్సెక్స్ ఓ సమయంలో 31వేల మార్క్ దాటింది. ఆర్బీఐ ప్రకటన అనంతరం 29,360కి పడిపోయింది. ఈ రోజుతో సెన్సెక్స్ భారీ హై (31వేలు) నుండి 1700 పాయింట్లు పడిపోయింది. నిన్నటితో పోలిస్తే మాత్రం మధ్యాహ్నం ఒకటిన్నర సమయానికి 400 పాయింట్లు దిగజారింది. నిఫ్టీ 9 వేల మార్క్ కిందకు పడిపోయింది.
అంతకుముందు.. స్టాక్ మార్కెట్లో లాభాల పరంపర కొనసాగింది. మూడు రోజులుగా లాభాల్లో ముగిసిన మార్కెట్లు, శుక్రవారం(మార్చి 27) లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.09:16 సమయానికి సెన్సెక్స్ 1,079.02 (3.60 శాతం) పాయింట్లు లాభపడి 31,025.79, నిఫ్టీ 366.00 (4.24%) పాయింట్లు ఎగిసి 9,007.45 వద్ద ప్రారంభమైంది. 505 షేర్లు లాభాల్లో, 62 షేర్లు నష్టాల్లో ఉండగా, 34 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. రూపాయి 46 పైసలు బలపడి 74.69 వద్ద ఉంది.
చాలా రోజుల తర్వాత మార్కెట్లలో దాదాపు అన్ని రంగాలు లేదా ఎక్కువ కంపెనీలు మూడు రోజులుగా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నేడు యాక్సిస్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, ఎస్పీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, మారుతీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, అల్ట్రా టెక్ సిమెంట్, టైటాన్, నెస్ట్లే, సన్ ఫార్మా, ఐటీసీ, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, రిలయన్స్, హిందూస్తాన్ యూనీ లీవర్ లాభాల్లో ఉండగా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఓఎన్జీసీ, హీరో మోటో కార్ప్, బజాజ్ ఆటో నష్టాల్లో ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఉద్దీపనల నేపథ్యంలో మార్కెట్లు నిన్న మూడో రోజు కూడా భారీ లాభాల్లోకి వ్చచాయి. మోడీ ప్రభుత్వం ప్రకటించిన రూ.1.70 లక్షల కోట్ల ఉద్దీపనల ప్యాకేజీ మార్కెట్ సెంటిమెంటును బలోపేతం చేసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 78 పైసలు పెరిగి 75.16 వద్ద క్లోజ్ అయింది. గత మూడు సెషన్లలో (మంగళ, బుధ, గురు) ఇన్వెస్టర్ల సంపద రూ.11.12 లక్షల కోట్లు పెరిగి రూ.112.99 లక్షల కోట్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications