భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, బలహీనపడిన రూపాయి
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. కరోనా భయం, ప్రపంచ మార్కెట్ల ప్రభావం నేపథ్యంలో సెన్సెక్స్ 29వేలకు దిగువకు చేరుకుంది. సెన్సెక్స్ ఈ రోజు 1,375 పాయింట్లు నష్టపోయి 28,440 వద్ద, నిఫ్టీ కూడా 379 పాయింట్లు నష్టపోయి 8,281 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. డాలర్ తో రూపాయి మారకం విలువ 75.57 వద్ద క్లోజ్ అయింది.
అంతకుముందు ఉదయం... కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రజల ప్రాణాలు తీసుకుంటోంది. ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చుతోంది. గత వారం భారత మార్కెట్లకు స్వల్ప ఊరట లభించింది. కానీ మృతుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా దాదాపు 34వేలకు చేరువ కావడం, కేసులు 7.22 లక్షలకు చేరుకోవడం, దేశంలోను కేసుల సంఖ్య వెయ్యికి పైగా పెరగడం, మృతుల సంఖ్య 27కు పెరగడం మార్కెట్లకూ ఆందోళన కలిగిస్తోంది. వైరస్ ప్రభావం రోజురోజుకు పెరుగుతుండటం మార్కెట్లపై ప్రభావం చూపిస్తోంది.
సోమవారం(మార్చి 30) గం.9.01 సమయానికి ప్రీ ఓపెన్ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 236.43 పాయింట్లు (0.79%) నష్టపోయి 29,579.16 వద్ద, నిఫ్టీ 301 పాయింట్లు (3.48%) కోల్పోయి 8,359.25 వద్ద ట్రేడ్ అయింది. ఓ సమయంలో సెన్సెక్స్ వెయ్యి పాయింట్లు కోల్పోయింది. ఆ తర్వాత పుంజుకొని 500 పాయింట్ల నష్టానికి వచ్చింది. రూపాయి 33 పైసలు బలహీనపడి 75.18 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. అంతకుముందు సెషన్‌లో 74.85 వద్ద క్లోజ్ అయింది.

ఆ తర్వాత ఉదయం గం.9.19 సమయానికి సెన్సెక్స్ 1,044.28 పాయింట్ల (3.50%) భారీ నష్టపోయి 28,771.31 వద్ద, నిఫ్టీ 298.80 పాయింట్లు కోల్పోయి(3.45%) 8,361.45 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. 670 షేర్లు లాభాల్లో, 67 షేర్లు నష్టాల్లో ప్రారంభించాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు కూడా నష్టాల్లోనే ట్రేడింగ్ ప్రారంభించాయి.


Click it and Unblock the Notifications