ఎగిసి'పడిన' మార్కెట్లు, సెన్సెక్స్ 58,000 పాయింట్ల దిగువకు
స్టాక్ మార్కెట్ బుధవారం(ఫిబ్రవరి 16, 2022) స్వల్ప నష్టాల్లో ముగిశాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ భయాల నేపథ్యంలో సోమవారం భారీగా పతనమైన సూచీలు, ఆ భయాలు తగ్గడంతో మంగళవారం అంతే ఎత్తుకు ఎగిశాయి. అయితే నిన్న సూచీలు భారీగా ఎగిసిపడటంతో నేడు ప్రాఫిట్ బుకింగ్ కనిపించి, మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 75.04 వద్ద ముగిసింది. మెటల్, పీఎస్‌యూ బ్యాంకు స్టాక్స్ నష్టాల్లో ముగియగా, రియాల్టీ భారీగా లాభపడింది. PNB హౌసింగ్ ఏకంగా పది శాతం లాభపడింది.

సెన్సెక్స్ 789 పాయింట్ల పైకి కిందకు
సెన్సెక్స్ ఉదయం 58,310.68 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైంది. అయితే కాసేపటికే ప్రాఫిట్ బుకింగ్ ప్రభావంతో సూచీలు నష్టాల్లోకి వెళ్లాయి. దీంతో ఓ దశలో 57,780 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం సెన్సెక్స్ భారీగా లాభపడి, 58,569 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. ఆ తర్వాత మళ్లీ నష్టాల్లోకి వెళ్లి, చివరకు 145 పాయింట్లు లేదా 0.25 శాతం నష్టపోయి 57,996.68 పాయింట్ల వద్ద ముగిసింది. నిన్న 58,000 పాయింట్ల పైన ముగిసిన సెన్సెక్స్, నేడు మళ్లీ ఈ మార్కు దిగువకు వచ్చింది. నిఫ్టీ 17,408.45 వద్ద ప్రారంభమై, 17,490.60 వద్ద గరిష్టాన్ని, 17,257.70 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 30 పాయింట్లు లేదా 0.17 శాతం క్షీణించి 17,322 పాయింట్ల వద్ద ముగిసింది.

నిఫ్టీ బ్యాంకు
నిఫ్టీ బ్యాంకు 216 పాయింట్లు పడిపోయి 37,954 పాయింట్ల వద్ద ముగిసింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 86 పాయింట్లు క్షీణించి 29,290 పాయింట్ల వద్ద నిలిచింది. దాదాపు అన్ని రంగాలు కూడా నష్టాల్లో ముగిశాయి. అత్యధిక రంగాలు నష్టాల్లో ముగిశాయి. డిసెంబర్ 22 నాటికి నిఫ్టీ 50 టార్గెట్‌ను 11 శాతానికి తగ్గించింది బోఫా సెక్యూరిటీస్. ఈ ప్రభావం కూడా మార్కెట్ పైన కనిపించింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేడు బీఎస్ఈ 30 స్టాక్స్‌లో ఇరవై స్టాక్స్ లాభాల్లో ముగియగా, 10 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో దివిస్ ల్యాబ్స్, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, ఐవోసీ, HDFC లైఫ్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్ప్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, అల్ట్రా టెక్ సిమెంట్ ఉన్నాయి. PNB హౌసింగ్ ఏకంగా పది శాతం ఎగిసింది.


Click it and Unblock the Notifications