పదేళ్లలో ఆ సంపద రూ.500 లక్షల కోట్లకు, సెన్సెక్స్ లక్షా యాభై వేలకు!
ముంబై: కేంద్ర బడ్జెట్ అనంతరం దేశీయ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. బడ్జెట్‌కు ముందు 46,000 స్థాయిలో ఉన్న సెన్సెక్స్ బడ్జెట్ అనంతరం నాలుగు రోజుల్లోనే 50,000 మార్కు దాటింది. సెన్సెక్స్ 51,000 పాయింట్ల దిశగా సాగుతోంది. నిఫ్టీ కూడా 14,896 పాయింట్ల వద్ద ముగిసి, 15,000 పాయింట్ల దిశగా సాగుతోంది. దీంతో చరిత్రలో తొలిసారి బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపద రూ.200 లక్షల కోట్లను దాటింది. గురువారం ట్రేడింగ్ ముగిసేసరికి లిస్టెడ్ సంస్థల మొత్తం మార్కెట్ విలువ రూ.200.47 లక్షల కోట్లుగా నమోదైంది.

జీవనకాల గరిష్టం
గత 4సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.14.34 లక్షల కోట్లు ఎగిసింది. ఆకర్షణీయ త్రైమాసిక ఫలితాలతో FMCG, బ్యాంకింగ్ షేర్ల కొనుగోళ్లు భారీగా నమోదయ్యాయి. నిన్న ఆసియా మార్కెట్లు డీలాపడగా, ఐరోపా సూచీలు లాభపడ్డాయి. సెన్సెక్స్ ఉదయం 50,212.25 పాయింట్ల వద్ద ప్రారంభమై, ఇంట్రాడేలో 49,926.45 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత పుంజుకుని లాభాల్లోకి వచ్చింది. సెన్సెక్స్ ఓ దశలో 50,687 పాయింట్ల వద్ద లైఫ్ టైమ్ గరిష్టాన్ని తాకి, చివరకు 358 పాయింట్ల లాభంతో 50,614 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ కూడా 14,913.70 పాయింట్ల వద్ద రికార్డు గరిష్ఠాన్ని తాకింది. మార్కెట్ దూకుడుతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.200 లక్షల కోట్లను దాటింది.

2020లో రూ.32.49 లక్షల కోట్లు జంప్
బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లోని ఇన్వెస్టర్ల సంపద 2020 మార్చి చివరి నాటికి రూ.6 లక్షల కోట్లను తాకింది. 2014 నవంబర్ 14న రూ.100 లక్షల కోట్లను, 2021 ఫిబ్రవరి 4న రూ.200 లక్షల కోట్లను తాకింది. 2020 క్యాలెండర్ ఏడాదిలో ఇన్వెస్టర్ల సంపద రూ.32.49 లక్షల కోట్లు పెరిగింది.

రూ.500 లక్షల కోట్లకు..
ఇప్పుడు 50,000 దాటిన సెన్సెక్స్ వచ్చే అయిదేళ్లలో రెట్టింపై 1,00,000 పాయింట్లకు చేరుకోవచ్చునని మార్కెట్ ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు. ప్రతి పదేళ్లకు సెన్సెక్స్ మూడు రెట్లవుతోందని, సూచీ ఏటా పదహారు శాతం సమ్మిళిత వృద్ధి కనబరుస్తోందని, ఇదే కొనసాగితే వచ్చే నాలుగైదేళ్లలో సెన్సెక్స్ లక్ష పాయింట్లకు, 2030 నాటికి 1,25,000-1,50,000 పాయింట్లకు చేరుకోవచ్చునని భావిస్తున్నారు. సెన్సెక్స్ 1.25 లక్షల మైలురాయికి చేరుకునే సమయానికి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.500 లక్షల కోట్లకు పెరగవచ్చునని అంచనా.


Click it and Unblock the Notifications