Senior Citizens: అతిత్వరలో కేంద్రం 2024 ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కాగా ఇప్పటికే పలు ప్రతిపాదనలు ఆర్థిక శాఖ వద్దకు చేరాయి. మూడోసారి కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టనున్న మొదటి బడ్జెట్ కావడంతో సామాన్యులు చాలా ఆశలు పెట్టుకున్నారు. దీనికితోడు అంచనా వేసుకున్న స్థాయిలో BJP సీట్లు సాధించలేకపోవడంతో బడ్జెట్ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించనుందని విశ్లేషకులు చెబుతున్నారు.
జూలై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఈసారి సీనియర్ సిటిజన్లపై కేంద్రం ఫోకస్ చేసింది. సాధ్యమైనంత మేరకు పన్ను రాయితీలు ప్రకటించనుందని నిపుణులు భావిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 5 లక్షల వరకు ఆరోగ్య కవరేజీని అందించే ఆయుష్మాన్ భారత్ గురించి ఇటీవల మ్యానిఫెస్టోలో పొందుపరిచింది. కాగా ఈ పథకాన్ని 70 ఏళ్లు పైబడిన వారికి కూడా వర్తింపజేస్తామన్న హామీ ఈ బడ్జెట్‌లో వాస్తవ రూపం దాల్చుతుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

ఇవే కాకుండా సీనియర్ సిటిజన్ల ఆర్థిక సమస్యలను తగ్గించడానికి ప్రభుత్వం మరింత చేయవచ్చని చార్టర్డ్ అకౌంటెంట్లు మరియు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఆదాయపు పన్ను బేసిక్ మినహాయింపు పరిమితిని పెంచాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ప్రస్తుతం ఉన్న 3 లక్షల లిమిట్‌ను ఈసారి 10 లక్షలు చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
'బ్యాంకు లేదా పోస్టాఫీసు డిపాజిట్ల నుంచి 5-6 లక్షల వడ్డీ ఆదాయాన్ని పొందే పలువురు సీనియర్ సిటిజన్లు ఉన్నారు. వారు తమ రిటర్న్‌లను దాఖలు చేయడంలో ఇబ్బంది పడవలసి వస్తోంది. అవసరమైన డాక్యుమెంట్స్ నిర్వహించడం వారికి కష్టమైన పని. ప్రాథమిక మినహాయింపు పరిమితిని 10 లక్షలకు పెంచడం వల్ల ప్రభుత్వం ఈ వర్గానికి మేలు చేసినట్లవుతుంది' అని ముంబైకి చెందిన చౌహాన్ & కో వ్యవస్థాపకులు చిరాగ్ చౌహాన్ తెలిపారు.
కరోనా అనంతరం దేశంలో ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థ దెబ్బతింది. అలాగే కుటుంబాల ఆర్థిక వ్యవస్థ సైతం కుంటుపడింది. దీంతో చాలా మంది ముందు జాగ్రత్తగా ఆరోగ్య బీమా తీసుకుంటున్నారు. అంతకంతకూ పెరుగుతున్న బీమా ప్రీమియం మోయలేని భారంగా తయారవుతోంది. ఇందుకోసం సీనియర్ సిటిజన్లకు ప్రస్తుతం ఇస్తున్న సెక్షన్ 80D మినహాయింపును 50 వేల నుంచి 1 లక్షకు పెంచడాన్ని కేంద్రం పరిశీలించాలని విజ్ఞప్తులు అందుతున్నాయి.


Click it and Unblock the Notifications