Meta: ఇటీవల జెస్ట్ మనీ వ్యవస్థాపకులు కంపెనీ నుంచి వైదొలుగుతున్నట్లు లింక్డ్ ఇన్ వేదికగా పోస్ట్ చేశారు. ఇదే ట్రెండ్ ను అనుసరిస్తూ సోషల్ మీడియా దిగ్గజం మెటా డైరెక్టర్, ఇండియాలో దాని భాగస్వామ్య అధిపతి మనీష్ చోప్రా తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. జనవరి 2019లో ఆయన సంస్థలో జాయిన్ కాగా ఇప్పటి వరకు సేవలందించారు. కొన్ని వారాల వరకు తన సహకారం అంజేస్తానని వెల్లడించారు.
"కొన్ని నెలలుగా ప్రతిఒక్కరూ వివిధ రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ టీమ్ చాలా శ్రద్ధ చూపిస్తూ, ఒకరికొకరు నిస్వార్థంగా సహాయం చేసుకుంటుందని నాకు తెలుసు. నా వృత్తి జీవితంలో కొత్త దశ కోసం ఇప్పుడు ఎదురు చూస్తున్నాను. తగిన సమయంలో భవిష్యత్ ప్లాన్స్ గురించి వెల్లడిస్తాను" అని తన లింక్డ్ ఇన్ పోస్ట్ లో మనీష్ తెలిపారు.

ఇండియాలో మెటా గణనీయమైన మార్పులు తీసుకురానున్న సమయంలో చోప్రా నిష్క్రమణ దిశగా నిర్ణయం తీసుకున్నారు. మెటా ఇండియా హెడ్ అజిత్ మోహన్ సైతం గతేడాది నవంబర్‌లో కంపెనీని విడిచి, సంస్థ ప్రత్యర్థి స్నాప్ లో చేరారు. అయితే ఈ ఏడాది జనవరి 1న మెటా ఇండియా హెడ్ గా సంధ్యా దేవనాథన్ బాధ్యతలు స్వీకరించే వరకు చోప్రా కంపెనీ తాత్కాలిక అధిపతిగాను పనిచేశారు.
మోహన్ నిష్క్రమించిన కొద్ది రోజుల్లోనే, వాట్సాప్ ఇండియా హెడ్ గా ఉన్న అభిజిత్ బోస్ కూడా దాదాపు నాలుగేళ్ల తర్వాత పదవీ విరమణ చేశారు. మెటా ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ గా ఉన్న రాజీవ్ అగర్వాల్ సైతం ఇదే బాటలో నడిచారు. గతేడాది సెప్టెంబర్ లో భారత్ లో వాట్సాప్ పే చీఫ్ పదవిని మనేష్ మహాత్మే వదులుకున్నారు.


Click it and Unblock the Notifications