IPO News: మార్కెట్లోకి మ్యాన్‌కైండ్ ఫార్మా ఐపీవో..! పూర్తి వివరాలు..
IPO News: అమ్మకాల పరంగా దేశంలో నాల్గవ అతిపెద్ద ఔషధ సంస్థ.. 2022 ఆర్థిక సంవత్సరానికి అమ్మకాల పరిమాణంలో రెండవ అతిపెద్దదిగా రికార్డు సృష్టించింది. తాజాగా కంపెనీ ఈ నెలలో తన ఐపీవోను మార్కెట్లోకి తీసుకొస్తోందని సమాచారం ఉన్నట్లు ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది.
ఈ క్రమంలో కంపెనీ దాదాపు రూ.4,200 కోట్ల నుంచి రూ.4,700 కోట్లను ఐపీవో ద్వారా సమీకరించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్లాన్ ఆచరణలోకి వచ్చినట్లయితే 2020లో గ్లాండ్ ఫార్మా చేపట్టిన రూ.6,480 కోట్ల IPO తర్వాత ఈ విభాగంలో అతిపెద్దదిగా నిలవనుంది. ఢిల్లీకి చెందిన ఫార్మా మేజర్ గతంలో సెప్టెంబర్ 2022లో సెబీకి తన ఐపీవోకు సంబంధించిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ పేపర్లను దాఖలు చేసింది.

ప్రస్తుతం మ్యాన్‌కైండ్ ఫార్మా ప్రైవేట్ ఈక్విటీ సంస్థ క్రిస్ క్యాపిటల్, క్యాపిటల్ ఇంటర్నేషనల్ మద్ధతుతో కొనసాగుతోంది. కంపెనీకి చెందిన మ్యాన్‌ఫోర్స్ కండోమ్‌లు, ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ప్రీగా న్యూస్, ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ బ్రాండ్ అన్‌వాంటెడ్ -72 మార్కెట్లో చాలా పాపులర్ అయ్యాయి. పైగా మ్యాన్‌ఫోర్స్ అత్యధికంగా అమ్ముడైన కండోమ్ బ్రాండ్‌గా నిలిచింది. ప్రస్తుతం కంపెనీ వేగంగా వృద్ధి చెందుతోంది. అయితే ఐపీవో వార్తలపై ఇప్పటి వరకు కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
మ్యాన్‌కైండ్ ఫార్మాను రమేష్ జునేజా స్థాపించారు. సంస్థ 1995లో ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ కంపెనీగా అవతరించింది. కంపెనీ దీర్ఘకాలిక, తీవ్రమైన చికిత్సా రంగాల్లో మెడికల్ ఫార్ములేషన్లను అభివృద్ధి, తయారీ, మార్కెటింగ్ చేయటంలో వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఇదే క్రమంలో కన్జూమర్ హెల్త్ కేర్ ఉత్పత్తులను సైతం మార్కెట్లోకి తీసుకొచ్చింది. 2022 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం కంపెనీ మెుత్తం ఆదాయంలో దాదాపు 97.60 శాతం దేశీయ మార్కెట్ల నుంచి వస్తోంది.
2022లో మ్యాన్‌కైండ్ ఫార్మా కొత్త చికిత్సా రంగాలను అన్వేషించడానికి ఇండియా-నేపాల్‌లో లిస్టెడ్ ప్లేయర్ పనేసియా బయోటెక్ ఫార్ములేషన్ బ్రాండ్‌లను రూ.1,872 కోట్లకు కొనుగోలు చేసింది.


Click it and Unblock the Notifications