Hotel fraud: ఢిల్లీలోని లగ్జరీ 5 స్టార్ హోటల్‌కు ఓ కస్టమర్ గట్టి షాక్ ఇచ్చాడు. రూపాయి కూడా చెల్లించకుండా ఏకంగా 2 సంవత్సరాలు అతిథిగా హోటల్‌లో స్టే చేశాడు. దీనివల్ల మొత్తం 58 లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని హోటల్ నిర్వాహకులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు.
ఏరోసిటీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (ఐజీఐ) విమానాశ్రయానికి సమీపంలో ఉన్న రోసేట్ హౌస్ అనే ఫైవ్ స్టార్ హోటల్.. ఓ అతిథిపై కేసు దాఖలు చేసింది. అంకుష్ దత్తా అనే వ్యక్తి ఒక్క చెల్లింపు కూడా చేయకుండా 603 రోజులపాటు హోటల్‌లో గడిపినట్లు బర్డ్ ఎయిర్‌పోర్ట్స్ హోటల్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున వినోద్ మల్హోత్రా FIR నమోదు చేయించారు.

మే 30, 2019న ఒక రాత్రికి దత్తా హోటల్‌లో చెక్ ఇన్ చేశాడు. అయితే ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్‌మెంట్ హెడ్ ప్రేమ్ ప్రకాష్.. హోటల్ నిబంధనలకు విరుద్ధంగా అంకుష్ దత్తా స్టే పొడిగింపు కోసం అనుమతిని మంజూరు చేశారు. దీంతో జనవరి 22, 2021 వరకు ఏమాత్రం చెల్లించకుండా హోటల్‌లోనే బస చేశాడు.
హోటల్ నిబంధనల ప్రకారం అతిథి బకాయిలు 72 గంటలు దాటితే.. CEO మరియు FCకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే దత్తా బకాయిల గురించి వారికి తెలియజేయడంలో ప్రకాష్ విఫలమయ్యారు. ఇందుకు తోడు అతిథుల బస, ఆర్థిక ఖాతాలను ట్రాక్ చేసే హోటల్ అంతర్గత సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌ను సైతం తారుమారు చేశారు. దత్తా నగదు ఆశచూపి అక్రమంగా ప్రకాష్‌ను లొంగదీసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు.
దత్తా వేర్వేరు తేదీల్లో 10 లక్షలు, 7 లక్షలు, 20 లక్షలకు 3 చెక్కులను చెల్లించినట్లు హోటల్‌లో రికార్డ్స్‌లో నమోదైంది. అయితే అవన్నీ బౌన్స్ అయ్యాయి. కాగా ఈ విషయాన్ని హోటల్ యాజమాన్యం దృష్టికి ప్రకాష్ తీసుకెళ్లలేదు. పెండింగ్‌లో ఉన్న అతడి బకాయిలను దాచడానికి సంబంధంలేని ఇతర అతిథులపై ఈ ఖర్చును ప్రకాష్ మోపారని హోటల్ విచారణలో తేలింది. పోలీసుల ప్రాథమిక విచారణలోనూ ఈ నేరాలు బయటపడ్డాయి.


Click it and Unblock the Notifications