Tesla: కారు యజమానికి టెస్లా బిత్తరపోయే షాక్.. రిపేర్ కోసం ఎన్ని లక్షల బిల్ వేసిందంటే..
Tesla: అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కి చెందిన టెస్లా కార్లను కొనుగోలు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా వాహనదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇందుకోసం కోట్లాది రూపాయలను సైతం వెచ్చించేందుకు వెనకాడరు. అయితే ఈ కార్స్ రిపేర్ బిల్లు చూసిన యజమానులకు గుండె ఆగినంత పని అవుతోంది.
'స్కాటిష్ టెస్లా మోడల్ Y ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్' కారు కొనుగోలు చేసిన ఓనర్ కు మస్క్ కంపెనీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. వాహనాన్ని మరమ్మతు కోసం ఇవ్వగా.. టెస్లా వేసిన బిల్లు చూసి ఖంగుతినడం యజమాని వంతైంది. ఏకంగా 17.46 లక్షల రిపేర్ ఖర్చు చూసి అతడు ఒక్కసారిగా భయపడినట్లు ప్రముఖ మీడియా సంస్థ తెలిపింది.

నివేదిక ప్రకారం.. భారీగా వర్షం కురుస్తున్న సమయంలో యజమాని కారును నడపడంతో రిపేర్ ఖర్చు తడిసి మోపెడు అయింది. తరువాత కొంతకాలం పాటు వాహనం బాగానే నడిచినా.. అనంతరం స్టార్ట్ అవలేదు. EVని టో ట్రక్ ద్వారా వర్క్ షాప్ కి తరలించడానికి ఓనర్ 5 గంటలు వేచి చూడాల్సి వచ్చింది. టెస్లా కస్టమర్ సర్వీస్ కూడా అంతగా సహాయపడలేదని యజమాని పేర్కొన్నాడు.
టెస్లా వర్క్‌షాప్ ఈ విషయంపై స్పందించింది. బ్యాటరీలోకి నీరు ప్రవేశించడం వల్ల ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్ పాడైపోయిందని తెలిపింది. ఇది ప్రొపల్షన్ సిస్టమ్ పై ప్రభావం చూపినట్లు వివరించింది. టెస్లా అందించే ఎనిమిదేళ్ల వారంటీ పరిధిలోకి ఇది రాలేదని స్పష్టం చేసింది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన యజమాని.. ఇంత పెద్ద మొత్తంలో బిల్లు రావడంపై తమ వర్క్‌షాప్ మేనేజర్‌ని నిలదీసినట్లు చెప్పింది.
ఈ విధంగా భారీ మొత్తంలో బిల్స్ వసూలు చేస్తూ, టెస్లా గతంలోనూ వార్తల్లో నిలిచింది. కానీ ఈసారి బిల్ మరింత షాకింగ్ గా ఉన్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. కస్టమర్ సపోర్ట్ వల్ల అంతగా ఉపయోగం లేదని వినియోగదారులు తరచుగా ఆరోపిస్తున్నారు.


Click it and Unblock the Notifications