రూ.40,000 కోట్లు వదిలి సన్యాసిగా మారిన సంపన్న వ్యాపారి కొడుకు.. పూర్తి వివరాలు..!!
Ananda Krishnan: ఒకప్పటి ఎయిర్‍సెల్ ఓనర్ మలేషియాకు చెందిన కుబేరుడు ఆనంద్ కృష్ణన్. 86 ఏళ్ల ఈ అత్యంత శక్తివంతమైన, మలేషియాలో మూడవ సంపన్నుడి పేరు ఆయన కుమారిడి కారణంగా ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఈ కుబేరుడి కుమారుడు వెన్ అజాన్ సిరిపన్యో ప్రాపంచిక సుఖాలు, సంపదను వదులుకుని బుద్ధ సన్యాసిగా మారిపోయాడు.
వాస్తవానికి ఆనంద్ కృష్ణన్ మెుత్తం సంపద విలువ దాదాపు రూ.40,000 కోట్లుగా ఉంది. కృష్ణన్ వ్యాపార సామ్రాజ్యం టెలికాం, ఆయిల్, గ్యాస్, శాటిలైట్స్, మీడియా అండ్ రియల్ ఎస్టేట్ వంటి వివిధ రంగాలకు విస్తరించి ఉంది. గతంలో ఇండియాలోని ఫేమస్ టెలికాం కంపెనీ అయిన ఎయిర్‍సెల్ ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్‌కు స్పాన్సర్‍గా కూడా వ్యవహరించారు. ఈ వ్యాపారవేత్త అమెరికాలోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కృష్ణన్ అనేక దాతృత్వ కార్యక్రమాలకు సహకారం అందించారు.

నిరాడంబరమైన ప్రారంభం నుంచి మలేషియాలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో ఒకరిగా మారిన ప్రయాణం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రేరణగా నిలుస్తోంది. అయితే ఆనంద కృష్ణన్‌కు అజాన్ సిరిపన్యో అనే కుమారుడు ఉన్నాడు. అతను తన 18 ఏళ్ల వయస్సులో ప్రాపంచిక ఆస్తులను వదులుకుని బౌద్ధ సన్యాసిగా మారటాన్ని కృష్ణన్ కూడా గౌరవించాడు. 18 ఏళ్ల వయస్సులో వెన్ సిరిపన్యో తన తల్లి కుటుంబంతో తిరిగి కనెక్ట్ కావడానికి థాయిలాండ్‌కు వెళ్లాడు. అక్కడ అతను తాత్కాలికంగా బౌద్ధ సన్యాసిగా మారాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ జీవితవిధానం, ఆధ్యాత్మికత నచ్చటంతో దానినే కొనసాగిస్తున్నాడు. సాధారణ జీవితాన్ని స్వీకరించి.. డబ్బు, ఆహారం లేదా ఇతర వస్తువులను దాతృత్వ విరాళంగా యాచించడాన్ని బౌద్ధ సన్యాసిగా కొనసాగిస్తున్నాడు.
అజాన్ సిరిపన్యో తల్లి మోమ్వజారోంగ్సే సుప్రీందా చక్రబన్, థాయ్ రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి . ప్రస్తుతం అజాన్ సిరిపన్యో మఠాధిపతిగా థాయిలాండ్-మయన్మార్ సరిహద్దుల్లో నివసిస్తున్నట్లు సమాచారం. సిరిపన్యో తన బాల్యాన్ని లండన్‌లో గడిపాడు. అలాగే చదువును యూకేలో పూర్తి చేశాడు.బౌద్ధమతం పట్ల ఆకర్షితుడైనప్పటికీ, సిరిపన్యోకు వివిధ సంస్కృతులతో పరిచయం ఉంది. ఇంగ్లీష్, తమిళ్, థాయ్‌తో సహా 8 భాషల్లో ప్రావీణ్యం ఉంది. సిరిపన్యో సన్యాసిగా జీవిస్తున్నప్పటికీ సిరిపన్యో తన కుటుంబానికి పూర్తిగా దూరం కాలేదు. ప్రియమైనవారితో సన్నిహితంగా ఉండడం అనేది ప్రధాన బౌద్ధ సూత్రం. ఒక సందర్భంలో అతను ఇటలీలో తన తండ్రిని కలవడానికి ప్రైవేట్ జెట్‌లో కూడా వెళ్లాడు. దాదాపు రెండు దశాబ్ధాలుగా అడవుల్లో బుద్ధ సన్యాసిగా తనకు నచ్చిన జీవితాన్ని ఈ వ్యాపారవేత్త కుమారుడు కొనసాగిస్తున్నాడు.


Click it and Unblock the Notifications