Flipkart News: చిక్కుల్లో పడిన ఫ్లిప్‌కార్ట్.. మలబార్ గోల్డ్ నుంచి ఊహించని షాక్..
Malabar Gold: ప్రముఖ దేశీయ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ చిక్కుల్లో పడింది. ఓ పక్కన సర్వీసు గురించి కస్టమర్స్ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న తరుణంలో.. కేసులు సైతం ఎదుర్కొంటోంది. ఇప్పటికే విచారణ జరుగుతున్న కేసులో కీలక తీర్పు వెలువడింది. అందరికీ సుపరిచితమైన మలబార్ గోల్డ్ సదరు సంస్థకు గట్టి షాక్ ఇచ్చింది.
వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ పై మలబార్ గోల్డ్ దివాలా చర్యలను ప్రారంభించింది. ఇందులో భాగంగా బెంగళూరులోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ఈ ఏడాది ఏప్రిల్ లో నమోదైన కేసుకు సంబంధించి మే నెలలో మొదటి విచారణ జరిగింది. ఈ సందర్భంగా NCLT బెంగళూరు బెంచ్ ప్రతివాదికి ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ కు నోటీసు జారీ చేసింది.

'నోటీసును సిద్ధం చేయమని రిజిస్ట్రీని ఆదేశించాం. సదరు నోటీసును ప్రతివాది కంపెనీకి మరియు MDకి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించమని సూచించాం. పిటిషన్ తో పాటు ఇతర అనుబంధాల కాపీలను కలెక్ట్ చేసుకుని వారికి అందించేందుకు పిటిషనర్‌కు న్యాయవాదిని అనుమతించాం. అదే కాపీలను ఇ-మెయిల్ ద్వారా కూడా అందజేయమని తెలిపాం. వారంలోగా ఇందుకు సంబంధించిన ట్రాకింగ్ రిపోర్టులతో పాటు సర్వీస్ అఫిడవిట్‌ను రిజిస్ట్రీ వద్ద దాఖలు చేయాలని ఆదేశించాం' అని బెంచ్ తెలిపింది.
ఈ విషయంలో అభ్యంతరాలు దాఖలు చేయడానికి ప్రతివాదికి 2 వారాల సమయం ఇస్తున్నట్లు బెంచ్ పేర్కొంది. కాపీని సక్రమంగా అందించిన తర్వాత ఏవైనా సమస్యలు ఉంటే రీజాయిండర్ దాఖలు చేయడానికి ఒక వారం గడువు మంజూరు చేసినట్లు చెప్పింది. కాగా మలబార్ గోల్డ్ కేసుపై అభ్యంతరాలను సమర్పించడానికి మరికొంత సమయం కావాలని ఫ్లిప్‌కార్ట్ తరపు న్యాయవాది కోరారు. దీంతో తదుపరి విచారణ ఆగస్టు 19కి వాయిదా పడింది.


Click it and Unblock the Notifications