HCLTech News: క్యూ2 రిజల్ట్స్‌తో ప్లాన్ మార్చేసిన హెచ్‌సీఎల్.. 10% పెరిగిన నికర లాభం..
HCLTech Q2 Results: వరుసగా టెక్ టాప్ దిగ్గజ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ తర్వాత మరో కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నేడు తన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీ తన భవిష్యత్తు ప్రణాళికలను సవరించుకుంది.
సెప్టెంబర్ త్రైమాసికంలో టెక్ దిగ్గజం 10 శాతం నికల లాభం వృద్ధితో రూ.3,832 కోట్లను నివేదించింది. ఇది పూర్తిగా నిపుణుల అంచనాలకు అనుగుణంగానే ఉంది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.3,489 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇదే క్రమంలో కంపెనీ రెవెన్యూ ఏడాది ప్రాతిపదికన 8.04 శాతం పెరిగి రూ.26,672 కోట్లుగా నిలిచింది. ఇది అంచనాల కంటే తక్కువగా నమోదైంది.

హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రెండవ త్రైమాసికంలో కంపెనీ రూ.27,010 ఆదాయాన్ని నమోదు చేస్తుందని అంచనా వేసింది. అలాగే పన్నుల తర్వాత లాభం రూ.3,667 కోట్లుగా ఉంటుందని లెక్కగట్టారు. టెక్ దిగ్గజం నేడు తన ఫలితాలను విడుదల చేస్తున్న తరుణంలో స్టాక్ కొంత నష్టాలకు గురైంది. మార్కెట్లు ముగిసే సమయంలో స్టాక్ 1.78 శాతం నష్టపోయి రూ.1,223.40 వద్ద ప్రయాణాన్ని ఎన్ఎస్ఈలో ముగించింది. ఇదే క్రమంలో ఒక్కో షేరుపై రూ.12 చొప్పున ఇంటెరిమ్ డివిడెండ్ ప్రకటించింది.
రూ.3.31 లక్షల కోట్ మార్కెట్ విలువతో ఇన్ఫోసిస్, టీసీఎస్ తర్వాత హెచ్‌సీఎల్ టెక్ మూడవ అతిపెద్ద ఐటీ కంపెనీగా దేశంలో కొనసాగుతోంది. HCLTech గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ. ఇది ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాల్లో 2,23,000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. కంపెనీ సాంకేతిక సేవలు ఉత్పత్తుల విస్తృత పోర్ట్‌ఫోలియో ద్వారా డిజిటల్, ఇంజనీరింగ్, క్లౌడ్, AI వంటి సేవలను కంపెనీలకు అందిస్తోంది. ప్రస్తుతం అస్థిరంగా కొనసాగుతున్న మార్కెట్ పరిస్థితుల్లో కంపెనీ తన భవిష్యత్తు వ్యూహాలను మార్చుకుంటోంది. ప్రధానంగా వ్యాపార మార్జిన్లు, కొత్త ప్రాజెక్టులపై ఎక్కువగా దృష్టి సారిస్తోందని సమాచారం.


Click it and Unblock the Notifications