IT News: ఏం చదివాం అన్నది కాదు భయ్యా చివరికి ఐటీ ఉద్యోగం చేశామా లేదా అన్నదే నేటి యువత లక్ష్యం. ఒత్తిడి ఉన్నప్పటికీ.. లక్షల్లో జీతాలు, నగరాల్లో పాష్ జీవితం కావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. ఐటీ ఉద్యోగం ఉంటే స్థిరమైన ఆదాయం వచ్చి జీవితం మెుత్తం మారిపోతుందని భావన.
ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవలకు డిమాండ్ తగ్గుతున్న వేళ భారత టెక్ కంపెనీలకు పెద్ద మెుత్తంలో డీల్స్ రావటం లేదు. చీప్ లేబర్ దొరుకుతుందని అమెరికా, యూరోపియన్ దేశాలు ఎక్కువగా భారత కంపెనీలకు ప్రాజెక్టులను అందిస్తుంటాయి. కానీ ప్రస్తుతం ఉద్యోగాలకు డిమాండ్ లేకపోవటంతో చాలా కంపెనీలు నియామకాలను పూర్తిగా నిలిపివేశాయి. పరోక్షంగా భారత ఆర్థిక వ్యవస్థను ఇది ప్రభావితం చేస్తోంది.

ప్రస్తుతం ఉద్యోగాల కోసం లక్షల మంది ఫ్రెషర్ల ఎదురుచూపులు మరింత కాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని త్రైమాసికాల పాటు ఈ పరిస్థితులు కొనసాగుతాయని నిపుణులు ఇప్పటికే చెబుతున్నారు. ఇప్పటికే రిక్రూట్ చేసుకున్న ఉద్యోగులకు తగిన స్థాయిలో ప్రాజెక్టులు లేక కంపెనీలు సతమతమోతున్నాయి. దీనివెనుక ప్రధాన కారణాలను పరిశీలిస్తే.. ప్రపంచ ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెరుగుదల వంటివి ఉన్నాయి. గత ఏడాదితో పోల్చితే సెప్టెంబర్‌లో 43 శాతం, అక్టోబర్‌లో 14 శాతం తగ్గుదల నమోదైంది.
దేశంలో లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, ప్రధాని మోదీకి నిరుద్యోగిత పెద్ద సమస్యగా మారనున్నట్లు పోల్ నిపుణులు చెబుతున్నారు. చాలా మంది యువత ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెట్టుకొచ్చేందుకు డిమాండ్ ఉన్న అన్ని టెక్ స్కిల్స్ నేర్చుకుంటున్నారు. అయితే నూతన ఉద్యోగ అవకాశాలు లేకపోవటం చాలా మందిని నిరుత్సాహానికి గురిచేస్తోంది. కంపెనీలు సైతం తమ వద్ద ఉన్న ఉద్యోగులకు కొత్త సాంకేతికతలపై శిక్షణ ఇస్తూ ఉద్యోగుల టర్నోవర్ రేషియోను, రిక్రూట్మెంట్ ఖర్చులను తగ్గించుకునేందుకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications