Electric Scooters: బాబోయ్.. ఎలక్ట్రిక్ స్కూటర్ల రేట్ల షాక్.. పూర్తి వివరాలు..
Electric Scooters: భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలపైనే ఉంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా రానున్న ఐదేళ్లలో పెద్ద మార్పు జరగబోతోంది.
ఈ క్రమంలో పరిశ్రమకు ఫేమ్ స్కీమ్ కింద ప్రోత్సాహకాన్ని కేంద్రం అందిస్తోంది. అయితే తాజాగా సబ్సిడీ మెుత్తాన్ని గతంలో ఉన్న 40 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జూన్ 1 లేదా ఆ తర్వాత రిజిస్టర్ చేసుకున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీని తగ్గించటంతో దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారులు తమ ధరలను భారీగా పెంచారు.

ఈ చర్య తర్వాత భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS మోటార్ తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ వాహనం iQube ధరను మోడల్‌ను బట్టి రూ.17,000 నుంచి రూ.22,000 వరకు పెంచింది. లాయల్టీ బెనిఫిట్ ప్రోగ్రాం కింద ఈ ధరను ప్రజలకు వెంటనే అందించకుండా మే 20లోపు బుక్ చేసుకున్న వారందరికీ పాత ధరకే వాహనాలు అందజేస్తామని టీవీఎస్ చైర్మన్, సీఈవో కేఎన్ రాధాకృష్ణన్ తెలిపారు.
అలాగే ఎలక్ట్రిక్ స్కూటర్ల రంగంలో ఆవిష్కరణలను తీసుకురావటం ద్వారా భారతీయ ద్విచక్ర వాహన విభాగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన Ather కంపెనీ తన Ather 450x ధరను దాదాపు రూ.8000 పెంచింది. దీంతో స్కూటర్ ధర బెంగళూరులో రూ.1,65,435కు చేరుకుంది. ఫేమ్ II పథకం కింద సబ్సిడీని రూ.32,000 తగ్గించినట్లు ఏథర్ ఎనర్జీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ రవ్‌నీత్ తెలిపారు.
ఇకపోతే ఓలా కంపెనీ తన టూవీలర్ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ అయిన ఓలా S1 ప్రో ధర రూ.1,39,999, S1 స్కూటర్ రూ.1,29,999, S1 ఎయిర్ స్కూటర్ రూ.1,09,999గా నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ప్రకటన తర్వాత సగటున స్కూటర్ల ధర దాదాపు రూ.15,000 పెరిగింది. అయితే హీరో ఎలక్ట్రిక్ మాత్రం ప్రస్తుతం వాహనాల ధరలను పెంచే ఆలోచనలో లేదు. ఈ సంస్థ తన ఎలక్ట్రిక్ వాహనాలను పాత ధరలకే విక్రయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications