Mahindra & Mahindra: దేశంలో అగ్రగామి వ్యాపారవేత్తగా ఉన్న ఆనంద్ మహీంద్రా సమాజంతో పాటు తమ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల పట్ల కూడా ఎక్కువ శ్రద్ధ వహిస్తుంటారు. పలుమార్లు సమాజిక అంశాలపై, టాలెంట్ ఉన్న వ్యక్తులకు సంబంధించిన ఆసక్తికర ట్వీట్స్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటుంటారు.
ఈ క్రమంలో తమ కంపెనీలో పనిచేసే మహిళా ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. మాతృత్వం అనేది ప్రతి స్త్రీకి సంతోషాన్నిచ్చే అంశం. ఈ క్రమంలో సదరు మహిళా ఉద్యోగులు పనితో పాటు పిల్లల కోసం సమయాన్ని కేటాయించాలనుకుంటారు. అందుకే ప్రసూతి సెలవు కింద మహిళా ఉద్యోగికి ఆమె గర్భదారణ, ప్రసవం, పిల్లల ప్రాథమిక సంరక్షణ కోసం సెలవు ఇవ్వబడుతుంది. ఈ కాలంలో వారు సెలవులో ఉన్నప్పటికీ పూర్తి జీతం అందిస్తారు.

తాజాగా మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఒక పెద్ద చొరవను ప్రారంభించింది. ఈ ప్రైవేట్ రంగ సంస్థ తన మహిళా ఉద్యోగుల కోసం కొత్త మెటర్నిటీ పాలసీని ప్రవేశపెట్టింది. ఇది 5 ఏళ్ల కాలానికి సంబంధించిన పాలసీ కావటం విశేషం. గ్రూప్ కింద పనిచేస్తున్న మహిళా కార్మికులందరికీ ఇది వర్తిస్తుంది. ఫ్యాక్టరీల్లో పనిచేసే మహిళలు కూడా మెటర్నిటీ పాలసీ పరిధిలోకి వస్తారు. పిల్లలను దత్తత తీసుకున్న మహిళలకు సైతం ఇవి యథావధిగా వర్తిస్తాయని కంపెనీ స్పష్టం చేసింది.
కంపెనీ అందిస్తున్న ఐదేళ్ల కొత్త మెటర్నిటీ బెనిఫిట్ పాలసీ కింద.. మేనేజర్ ఆమోదంతో 6 నెలల ఫ్లెక్సిబుల్ వర్కింగ్ ఆప్షన్, 24 నెలల హైబ్రిడ్ వర్కింగ్ ఆప్షన్‌ను మహిళా ఉద్యోగులు పొందుతారు. దీంతో పాటు ఒక వారం తప్పనిసరి ప్రసూతి సెలవులు కూడా ఇస్తారు. చైల్డ్ మెయింటెనెన్స్ కోసం సెలవు తీసుకోవాలనుకునే మహిళా ఉద్యోగుల విషయంలో.. కంపెనీ ఒక ఏడాది పాటు వేతనం లేకుండా సెలవు ఎంపికను అందిస్తోంది. కానీ ఈ సౌకర్యం కంపెనీలు 36 నెలల సర్వీస్ పూర్తి చేసుకున్న మహిళలకు మాత్రమేనని తెలిపింది. ప్రసూతి సెలవు తర్వాత ఉద్యోగానికి తిరిగి వచ్చే మహిళల కోసం కంపెనీ కెరీర్ హామీ పాలసీని కూడా అందిస్తోంది. మహిళలకు పూర్తి మద్దతు ఇవ్వడమే ఈ పాలసీ లక్ష్యమని చీఫ్ బ్రాండ్ ఆఫీసర్ ఆశా ఖర్గా వెల్లడించారు.


Click it and Unblock the Notifications