Tomato: రైతును కోటీశ్వరుడిని చేసిన టమాటా.. నెల రోజుల్లో మారిపోయిన తలరాత..
Tomato: దేశవ్యాప్తంగా ఇటీవల విపరీతంగా పెరిగిన టమాటా ధరలు సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. వంటింట్లోకి వెళ్లాలంటేనే వారికి భయం వేసే స్థాయికి కూరగాయలు, నిత్యావసరాల ధరలు చేరుకున్నాయి.
అయితే పెరిగిన టమాటా ధరలు మహారాష్ట్ర, పూణె జిల్లాలో టమాటా సాగు చేసిన రైతు తలరాత మార్చేశింది. తుకారాం భాగోజీ గయాకర్ అనే రైతు, అతని కుటుంబం నెల రోజుల్లో 13,000 టమాటా డబ్బాలను విక్రయించడం ద్వారా రూ.1.5 కోట్లకు పైగా సంపాదించింది. దీంతో ఆ రైతు కుటుంబం కోటీశ్వరులుగా మారిపోయింది.

రైతు తుకారాంకు 18 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా.. అందులో 12 ఎకరాల భూమిలో కుమారుడు ఈశ్వర్ గయాకర్, కోడలు సోనాలి సహకారంతో టమాటా సాగు చేశాడు. నాణ్యమైన టమాటాలను పండించటానికి వారికి ఉన్న అనుభవం దోహదపడిందని ఆ కుటుంబం వెల్లడించింది. నారాయణగంజ్‌లో ఒక టమాటా క్రేట్‌ను అమ్మడం ద్వారా రైతు ఒక్కరోజులో రూ.2,100 సంపాదించారు. అలాగే గయాకర్ శుక్రవారం నాడు మొత్తం 900 క్రేట్లను విక్రయించి ఒక్కరోజులోనే రూ.18 లక్షలు సంపాదించారు.
గత నెలలో టమాటా క్రేట్లను నాణ్యత ఆధారంగా ఒక్కొక్కటి రూ.1000 నుంచి 2,400 మధ్య ధర పలికిందని రైతు తుకారాం కుటుంబం వెల్లడించింది. ఇదే క్రమంలో పూణె జిల్లాలోని జున్నార్‌లో టమోటాలు పండిస్తున్న చాలా మంది రైతులు సైతం ఈఏడాది టమాటా గిరాకీ ధరలతో కోటీశ్వరులుగా మారారు. ఈ కమిటీ టమాట విక్రయం ద్వారా నెల రోజుల్లో రూ.80 కోట్ల వ్యాపారం చేసింది. దీనికి తోడు ఆ ప్రాంతంలో 100 మందికి పైగా మహిళలకు ఉపాధి అవకాశాలు దొరికాయి.
తుకారాం కోడలు సోనాలి మొక్కలు నాటడం, పంట కోయడం, ప్యాకేజింగ్ చేయడం వంటి పనులను నిర్వహించగా.. కుమారుడు ఈశ్వర్ విక్రయాలు, నిర్వహణ, ఆర్థిక ప్రణాళికలను నిర్వహించాడు. మార్కెట్‌కు అనుకూలమైన పరిస్థితులు నెలకొనడంతో గత మూడు నెలలుగా తమ కుటుంబం చేసిన శ్రమకు ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. టమోటాలు అమ్మి రైతులు లక్షాధికారులుగా మారడం ఒక్క మహారాష్ట్రకే పరిమితం కాలేదు. ఈ ఏడాది కర్నాటకలోని కోలార్‌కు చెందిన ఓ రైతు కుటుంబం ఈ వారం 2,000 టమాట పెట్టెలను విక్రయించి రూ.38 లక్షలతో ఇంటికి తిరిగి వెళ్లింది.


Click it and Unblock the Notifications