కిడ్నీ అమ్ముకున్నా తీరని అప్పు.! విదేశాల్లో వెట్టిచాకిరి.. ఒక పేద రైతు అనుభవించిన నరకం ఇదీ!
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన రోషన్ కులే అనే సన్నకారు రైతు కథ ఇది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక మనిషి ఎంతటి దారుణమైన నిర్ణయాలైనా తీసుకుంటాడని ఈ ఘటన నిరూపిస్తోంది. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక తన కిడ్నీని అమ్ముకోవడమే కాకుండా విదేశాల్లో బానిసగా మారి.. ఆఖరికి చావు అంచుల వరకూ వెళ్లి వచ్చాడు.
లక్ష అప్పు.. 74 లక్షల బాకీగా ఎలా మారింది?
రోషన్ కులే తన అవసరాల కోసం స్థానిక వడ్డీ వ్యాపారుల వద్ద కేవలం రూ. 1 లక్ష అప్పుగా తీసుకున్నాడు. కానీ, ఆ వడ్డీ వ్యాపారులు విధించిన వడ్డీ రేట్లు చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. నెలకు 40% వడ్డీతో పాటు రోజుకు రూ. 5,000 పెనాల్టీ విధిస్తూ చక్రవడ్డీ లెక్కలు వేశారు. దీనివల్ల రోషన్ ఇప్పటికే రూ. 48.53 లక్షలు చెల్లించినప్పటిక.. ఇంకా రూ. 74 లక్షలు బాకీ ఉన్నావంటూ వేధింపులకు గురిచేశారు.

కిడ్నీ అమ్మకం.. విదేశాల్లో బందీగా..
వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక.. అప్పు తీర్చేందుకు రోషన్ అక్టోబర్ 2024లో కంబోడియా వెళ్లి తన కిడ్నీని రూ. 8 లక్షలకు అమ్ముకున్నాడు. ఆ డబ్బుతో కొంత అప్పు తీర్చవచ్చని భావించాడు. ఆ తర్వాత విదేశాల్లో మంచి ఉద్యోగం దొరుకుతుందన్న ఏజెంట్ మాటలు నమ్మి లావోస్ (Laos) దేశానికి వెళ్లాడు. కానీ అక్కడ అతనికి అసలు నరకం మొదలైంది.
అక్కడి ఏజెంట్లు అతని పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకుని అమానవీయ పరిస్థితుల్లో వెట్టిచాకిరి చేయించారు. ప్రశ్నిస్తే "నువ్వు చచ్చే వరకు ఇక్కడే పని చేయాలి" అంటూ బెదిరించారు. ఆరోగ్యం క్షీణించినా కనికరం లేకుండా పని చేయించారు.
వాట్సాప్ కాల్‌తో బయటపడ్డ ప్రాణం
ఎలాగోలా రోషన్ తన పరిస్థితిని వివరిస్తూ మహారాష్ట్ర మాజీ ప్రతిపక్ష నేత విజయ్ వడెట్టివార్‌కు వాట్సాప్ వాయిస్ కాల్ ద్వారా సమాచారం అందించాడు. ఆయన వెంటనే స్పందించి భారత రాయబార కార్యాలయానికి వివరాలు పంపడంతో.. లావోస్ అధికారులు రోషన్‌ను రక్షించి తిరిగి భారత్‌కు పంపారు.
పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు
రోషన్ తిరిగి వచ్చాక చేసిన వైద్య పరీక్షల్లో అతని ఒక కిడ్నీ మాయమైనట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో ఇది కేవలం అప్పుల గొడవ మాత్రమే కాదని, దీని వెనుక అంతర్జాతీయ అవయవాల స్మగ్లింగ్ ముఠా ఉందేమోనన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఐదుగురు అక్రమ వడ్డీ వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
వడ్డీలతో జాగ్రత్త..
అక్రమ వడ్డీ వ్యాపారుల దారుణాలకు ఈ ఘటన ఒక నిదర్శనం. మీ చుట్టుపక్కల ఎవరైనా ఇలాంటి వేధింపులకు గురవుతుంటే వెంటనే పోలీసులను సంప్రదించండి. కేవలం రూ. లక్ష కోసం ఒక నిండు ప్రాణం కిడ్నీ అమ్ముకుని, విదేశాల్లో బానిసగా మారడం సభ్య సమాజం తలదించుకోవాల్సిన విషయం. అలాగే మీరు కూడా ఎప్పుడూ అధిక వడ్డీలకు రుణాలు తీసుకోకుండా జాగ్రత్తపడండి.


Click it and Unblock the Notifications