ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ బిలియనీర్ ఫౌండర్ జెఫ్ బెజోస్ సతీమణి మెకెంజీ స్కాట్ గత నాలుగు నెలల కాలంలో 4.1 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.30వేల కోట్లు) దాతృత్వ కార్యకలాపాలకు ఇచ్చింది. ఇందులో భాగంగా ఫుడ్ బ్యాంక్స్, ఎమర్జెన్సీ రిలీఫ్ ఫండ్స్ కోసం ఆమె ఈ మొత్తాన్ని వెచ్చించారు. కొన్నేళ్ళ క్రితం జెఫ్ బెజోస్-మెకెంజీల విడాకులు ప్రపంచంలోనే ఖరీదైన డైవర్స్‌గా నిలిచాయి. ఆ తర్వాత అమెజాన్‌లో వాటా దక్కింది. ప్రపంచ కుబేరుల జాబితాలో మెకెంజీ 18వ స్థానంలో ఉన్నారు.

వీటి కోసం భారీగా ఖర్చు
కరోనా కారణంగా ఎంతోమంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కరోనా బాధితులను ఆదుకునేందుకు ఈ వితరణ చేశారు. అమెరికాలో ఆరోగ్యం, ఆహారం, ఆర్థికంగా సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రజలకు సహాయంగా 384 సంస్థలకు మెకెంజీ స్కాట్ నిధులు అందించారు. ఫుడ్ బ్యాంకులు, ఎమర్జెన్సీ రిలీఫ్ ఫండ్స్‌కు 4.1 బిలియన్ డాలర్లను (4,158,500,000 డాలర్లు) అందించినట్లు బ్లాగు ద్వారా తెలిపారు. దీర్ఘకాలిక రుణ బాధల నుంచి విముక్తి, ఉపాధి శిక్షణ, న్యాయ సంరరక్షణ వంటి వాటికి కూడా నిధులను ఇచ్చినట్లు తెలిపారు. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, సమానత్వం తదితరాలకు మద్దతుగా జులైలో 1.7 బిలియన్ డాలర్లను వెచ్చించినట్లు చెప్పారు.

వాషింగ్టన్ డీసీ సహా..
4.1 బిలియన్ డాలర్ల ఫండ్‌తో గత నాలుగు నెలలుగా 50 రాష్ట్రాల్లో సహాయక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్యూర్టోరికో, వాషింగ్టన్ డీసీ సహా వివిధ రాష్ట్రాల్లోని సంస్థలకు సాయం చేసినట్లు తెలిపారు. ఫుడ్ బ్యాంక్స్ ఎమర్జెన్సీ రిలీఫ్ సంస్థలు, ఇతర సహాయక సంస్థలకు ఈ మొత్తం ఇచ్చారు.

ఈ ఏడాది ఆస్తులు జంప్
జెఫ్ బెజోస్ నుంచి విడిపోయిన సమయంలో తన సంపదలో అత్యధిక భాగాన్ని వితరణకు వెచ్చించేందుకు వీలుగా మెకెంజీ సంతకం చేశారు. బెజోస్‌తో అమెజాన్‌లో మెకెంజీకి 4 శాతం వాటా లభించింది. అమెజాన్ షేర్లు ఇటీవలి కాలంలో దూసుకెళ్లడంతో ఆమె సంపద 23.6 బిలియన్ డాలర్లు పెరిగి 60.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది ఇప్పటివరకు మెకెంజీ 5.7 బిలియన్ డాలర్లను వితరణకు వెచ్చించారు.


Click it and Unblock the Notifications