Gas booking: గ్యాస్ బుక్ చేస్తున్నారా? ఈ కొత్త రూల్ తెలుసుకోండి! ఇకపై బుకింగ్ చేయాలంటే ఇది ఉండాల్సిందే!
గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? అయితే మీకు ఈ వార్త చాలా ముఖ్యం. మే 1, 2026 నుండి గ్యాస్ బుకింగ్ (Gas booking) , డెలివరీ నియమాల్లో కీలక మార్పులు రాబోతున్నాయి. పశ్చిమ ఆసియాలో (West Asia) జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగడమే దీనికి ప్రధాన కారణం. మరి సామాన్యుడిపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలేంటో ఇప్పుడు చూద్దాం.

పెరగనున్న సిలిండర్ ధరలు?
గత కొన్ని నెలలుగా గ్యాస్ ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. ఫిబ్రవరి చివరలో ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుండి, చమురు కంపెనీలు గృహ అవసరాలకు వాడే 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధరను ఇప్పటికే రూ. 60 మేర పెంచాయి. కమర్షియల్ సిలిండర్ల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఏప్రిల్ నెలలో ఏకంగా రూ. 196 పెరిగింది. మే 1న జరగబోయే సమీక్షలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (IOCL, BPCL, HPCL) ధరలను మరోసారి సవరించే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.
బుకింగ్ గ్యాప్ పెరిగింది.. జాగ్రత్త!
మీరు గ్యాస్ అయిపోకముందే బుక్ చేసుకునే అలవాటు ఉంటే, ఇకపై అది కుదరకపోవచ్చు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ గ్యాస్ బుకింగ్ (Gas booking) నిబంధనలను కఠినతరం చేసింది.
• పట్టణాల్లో: ఒక బుకింగ్‌కు, మరో బుకింగ్‌కు మధ్య గ్యాప్ 21 రోజుల నుండి 25 రోజులకు పెంచారు.
• గ్రామాల్లో: ఈ గ్యాప్ ఏకంగా 45 రోజుల వరకు ఉంటుంది. అంటే, ఒకసారి సిలిండర్ తీసుకున్నాక నిర్ణీత రోజులు గడిస్తేనే మళ్ళీ బుక్ చేసుకోవడానికి వీలవుతుంది. సబ్సిడీ సిలిండర్లు పక్కదారి పట్టకుండా ఉండటానికే ఈ నిర్ణయం తీసుకున్నారు.
OTP ఉంటేనే డెలివరీ
ఇకపై డెలివరీ సమయంలో OTP (డెలివరీ అథెంటికేషన్ కోడ్) తప్పనిసరి కాబోతోంది. ప్రస్తుతం 94% డెలివరీలు ఈ పద్ధతిలోనే జరుగుతున్నాయి, మే నుండి దీన్ని వంద శాతం పక్కాగా అమలు చేయనున్నారు. మీ ఫోన్‌కు వచ్చే కోడ్ చెబితేనే సిలిండర్ మీ చేతికి వస్తుంది. కాబట్టి గ్యాస్ కనెక్షన్‌కు మీ కరెక్ట్ మొబైల్ నంబర్ లింక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.
ఆధార్ e-KYC ఎవరికి అవసరం?
ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ గురించి చాలామంది కంగారు పడుతున్నారు. అయితే ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది..
- ఉజ్వల కస్టమర్లు: ప్రధాని మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు కచ్చితంగా e-KYC పూర్తి చేయాలి. వీరికి సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ ప్రాసెస్ ఉంటుంది. ముఖ్యంగా 8వ రీఫిల్ నుండి సబ్సిడీ రావాలంటే ఇది తప్పనిసరి.
- సాధారణ కస్టమర్లు: మీరు ఇప్పటికే ఒకసారి e-KYC పూర్తి చేసి ఉంటే, మళ్ళీ చేయాల్సిన పని లేదు.
PNG కనెక్షన్ తీసుకోకపోతే గ్యాస్ కట్!
ప్రభుత్వం ఇప్పుడు ఎల్‌పీజీ కంటే పైపుల ద్వారా వచ్చే గ్యాస్ (PNG) వైపు మొగ్గు చూపుతోంది. మీ ఏరియాలో PNG లైన్లు అందుబాటులో ఉండి కూడా మీరు కనెక్షన్ తీసుకోకపోతే, మూడు నెలల తర్వాత మీ ఎల్‌పీజీ సరఫరాను నిలిపివేస్తారు. ఇప్పటికే దాదాపు 8 లక్షల కనెక్షన్లు పూర్తయ్యాయి. పైపుడ్ గ్యాస్ వాడేవారు కొత్తగా ఎల్‌పీజీ కనెక్షన్ తీసుకోవడానికి కూడా వీల్లేదు.
సరఫరాలో ఇబ్బంది ఉండదు
యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పటికీ, గృహ అవసరాలకు వాడే గ్యాస్ సరఫరాలో ఎలాంటి కోత ఉండదని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వలస కూలీల కోసం ఇచ్చే 5 కిలోల చిన్న సిలిండర్ల కోటాను కూడా రెట్టింపు చేశారు. కాబట్టి ధరల భయం ఉన్నప్పటికీ, గ్యాస్ కొరత వచ్చే అవకాశం తక్కువ.


Click it and Unblock the Notifications