LPG: మీ జేబుకు చిల్లు పడాల్సిందే: గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. తాజా వివరాలివే!
దేశవ్యాప్తంగా సామాన్యులందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న బడ్జెట్ 2026 రోజునే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఊహించని షాక్ ఇచ్చాయి. ప్రతి నెల ఒకటో తేదీన చమురు సంస్థలు గ్యాస్ ధరలను సమీక్షిస్తుంటాయి. అయితే, ఈసారి ఫిబ్రవరి 1న కమర్షియల్ ఎల్‌పిజి (LPG) సిలిండర్ల ధరను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీనివల్ల సామాన్యులపై నేరుగా కాకపోయినా పరోక్షంగా హోటల్ ఖర్చులు, బయట దొరికే తినుబండారాల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ఎంత పెరిగింది? ఎక్కడ ఎంత ధర?
తాజా అప్‌డేట్ ప్రకారం, 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ ధరపై ఏకంగా 50 రూపాయలు పెంచారు. ఈ పెంపుతో ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో నిన్నటి వరకు రూ. 1691.50 గా ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు రూ. 1740.50 కి చేరింది. అదేవిధంగా కోల్‌కతాలో రూ. 1844.50, ముంబైలో రూ. 1692 , చెన్నైలో రూ. 1899.50 వద్ద ధరలు కొనసాగుతున్నాయి. 2026 సంవత్సరంలో వరుసగా రెండో నెల కూడా ఈ ధరలు పెరగడం గమనార్హం.
గృహిణులకు భారీ ఊరట!
ఒకవైపు కమర్షియల్ సిలిండర్ ధరలు భయపెడుతున్నా, గృహిణులకు మాత్రం ఒక తీపి కబురు అందిందనే చెప్పాలి. ఇళ్లలో వాడే 14.2 కిలోల డొమెస్టిక్ LPG సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం ఢిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 853 గా ఉండగా, హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా దాదాపు అదే స్థాయిలో స్థిరంగా ఉంది. గత ఏడాది ఏప్రిల్ నుంచి గృహ అవసరాల సిలిండర్ల ధరలు పెరగకపోవడం మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరటనిస్తోంది.
గత ఏడాది బడ్జెట్ తో పోలిస్తే..
నిజానికి గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన (బడ్జెట్ 2025 రోజు) గ్యాస్ ధరల్లో స్వల్ప తగ్గింపు కనిపించింది. అప్పట్లో కమర్షియల్ సిలిండర్ పై కేవలం 6.50 పైసలు తగ్గించారు. కానీ ఈ ఏడాది మాత్రం ఏకంగా 50 రూపాయలు పెరగడం ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది. డిసెంబర్, నవంబర్ నెలల్లో ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ధరలు మళ్ళీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
ధరలు ఎందుకు మారుతుంటాయి?
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు , రూపాయి విలువ ఆధారంగా మన దేశంలోని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు (HPCL, BPCL, IOCL) ప్రతి నెల ఒకటో తేదీన LPG ధరలను సవరిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా గ్యాస్ ఉత్పత్తి , సరఫరాలో వచ్చే మార్పులు ఈ ధరల పెంపుపై ప్రభావం చూపుతాయి.
మొత్తానికి బడ్జెట్ ప్రసంగం కంటే ముందే గ్యాస్ ధరల పెరుగుదల వార్త బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ మీరు కూడా హోటల్ బిజినెస్ లేదా క్యాటరింగ్ రంగంలో ఉన్నట్లయితే, ఈ రోజు నుంచే మీ ఖర్చుల లెక్కలు మారబోతున్నాయి జాగ్రత్త!


Click it and Unblock the Notifications