ఎల్పీజీ ధరల సెగ..జూన్ 1 నుండి సిలిండర్ బుకింగ్, నిబంధనలలో కీలక మార్పులు
దేశంలో ఇంధనం, సీఎన్‌జీ ధరలు వరుసగా పెరిగిన తర్వాత, ఇప్పుడు సామాన్యుడి వంటగదిపై ఎల్పీజీ (LPG) ధరల భారం పడనుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ ముడి చమురు మార్కెట్‌లో ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ నష్టాల భారాన్ని తగ్గించుకోవడానికి జూన్ 1 నుండి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్ విధానంలో, ధరలలో ఓఎంసీలు ప్రధాన మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఇండేన్ గ్యాస్, భారత్ గ్యాస్, హెచ్‌పి గ్యాస్ కనెక్షన్‌లను సరెండర్ చేసే ప్రక్రియతో పాటు గ్యాస్ రీఫిల్ లాక్-ఇన్ పీరియడ్‌లో సవరణలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య (Commercial) గ్యాస్ సిలిండర్ ధరలను మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి పెంచడం గమనార్హం. 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర కోల్‌కతాలో అత్యధికంగా రూ. 1,147 పెరిగి రూ. 3,355కు చేరింది. చెన్నైలో రూ. 1,013 పెరిగి రూ. 3,259.5కు, ముంబైలో రూ. 3,046.5కు, మరియు దేశ రాజధాని ఢిల్లీలో రూ. 3,071.5కు ఈ ధరలు చేరుకున్నాయి.

వాణిజ్య ధరల పెరుగుదల ఇలా ఉంటే, గృహ వినియోగదారులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం మే 25న తన 'ఎల్‌పిజి సవరణ ఉత్తర్వు 2026'ను జారీ చేసింది. పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్లు కూడా కలిగి ఉన్న గృహ ఎల్‌పిజి వినియోగదారులకు అదనపు సడలింపులు అందించడంపై ఈ కొత్త ఉత్తర్వు ప్రత్యేక దృష్టి సారించింది. కొత్త నిబంధన ప్రకారం, ఒక వ్యక్తి తన ఇంటికి పీఎన్‌జీ కనెక్షన్ పొందినప్పుడు, అప్పటికే ఉన్న ఎల్‌పీజీ కనెక్షన్‌ను రద్దు చేసుకోవడానికి లేదా సరెండర్ చేయడానికి అతనికి 30 రోజుల పాటు గడువు ఉంటుంది. గతంలో పీఎన్‌జీ కనెక్షన్ పొందిన వెంటనే ఎల్‌పీజీ కనెక్షన్‌ను రద్దు చేసుకోవాలనే నిబంధన ఉండేది. అయితే వినియోగదారుల సౌకర్యార్థం, వారు ఒకవేళ తమ ఎల్‌పీజీ కనెక్షన్‌ను పునరుద్ధరించుకోవాలనుకుంటే (రీ-యాక్టివేట్) దానికి అనుమతించే ప్రత్యేక నిబంధనను కూడా ప్రభుత్వం ఈ ఉత్తర్వులో ప్రకటించింది.
దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న ఎల్‌పీజీ గ్యాస్ డిమాండ్‌ను సమర్థవంతంగా నిర్వహించడానికి, సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టడానికి ప్రభుత్వం పలు గట్టి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే 'ఒక ఇంటికి ఒకే గ్యాస్ కనెక్షన్' నిబంధనను ప్రభుత్వం గట్టిగా ప్రోత్సహిస్తోంది. పీఎన్‌జీ గ్యాస్ వినియోగాన్ని పెంచడానికి, సాంప్రదాయ ఎల్‌పీజీ సిలిండర్లపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, ఇప్పటికే పీఎన్‌జీ కనెక్షన్ ఉన్న వినియోగదారులు కొత్తగా ఎల్‌పీజీ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవడాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. దీనివల్ల గ్యాస్ కనెక్షన్లు లేని అర్హులైన ఇతరులకు ఎల్‌పీజీ సులభంగా అందుబాటులోకి వస్తుంది.
దీనికి తోడు, గ్యాస్ రీఫిల్లింగ్ కోసం ప్రస్తుతం ఉన్న 45 రోజుల లాక్-ఇన్ పీరియడ్‌ను కూడా చమురు మార్కెటింగ్ కంపెనీలు సవరించబోతున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా. దేశంలో గ్యాస్ కొరత ఏర్పడకుండా,సరఫరాను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం ఎల్‌పీజీ కొనుగోలు వ్యవధిని (రెండు సిలిండర్ల బుకింగ్ మధ్య ఉండాల్సిన కనీస గడువు) పొడిగించింది. తాజా నిబంధనల ప్రకారం, ఈ గడువును పట్టణ ప్రాంతాల వినియోగదారులకు 25 రోజులకు మరియు గ్రామీణ ప్రాంతాల వినియోగదారులకు 45 రోజులకు పెంచారు. ఇంతకుముందు ఈ గడువు అందరికీ సమానంగా 21 రోజులుగా మాత్రమే ఉండేది. అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిళ్ల నేపథ్యంలో దేశీయ ఇంధన భద్రతను కాపాడుతూనే, వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా చమురు రంగాన్ని బలోపేతం చేసేందుకే ప్రభుత్వం ఈ నిబంధనలను తీసుకువచ్చింది.


Click it and Unblock the Notifications
