గ్యాస్ సిలిండర్ ధరలు షాకిచ్చాయి. ఇటీవలి వరకు వివిధ కారణాలతో గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా తగ్గాయి. ఇప్పుడు జూన్ నెలకుగాను ధరలు ఎగిశాయి. వంట గ్యాస్ ధరలను పెంచుతూ గ్యాస్ కంపెనీలు నిర్ణయించాయి. ఈ ధరలు నేటి నుండి (జూన్ 1) అమలులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ ధరలను చమురు రంగ కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన సమీక్షిస్తాయి. ఇందులో భాగంగా గత కొంతకాలంగా తగ్గిన ధరలు, ఇప్పుడు పెరిగాయి.

రూ.110 వరకు పెరిగిన ధర
దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల నాన్-సబ్సీడీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.11.50 పెరిగింది. దీంతో సిలిండర్ ధర రూ.593కి చేరుకుంది. అలాగే 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధరపై రూ.110 పెరిగింది. దీంతో ఈ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,139కి చేరుకుంది. 'జూన్ 2020 నెలకు గాను అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుదల కారణంగా ఢిల్లీలో ఎల్పీజీ రిటైల్ ధర రూ.11.50 పెరుగుతోంద'ని ఇండియా అతిపెద్ద రిఫైనర్ అయిన ఐవోసీ ఆదివారం ఓప్రకటనలో తెలిపింది.

ప్రస్తుతానికి వారికి సిలిండర్లు ఉచితం
మే నెలలో వంట గ్యాస్ ధర రూ.744 నుండి రూ.581.50కి తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ఫ్యూయల్ ధర తగ్గడంతో భారీగా తగ్గింది. జూన్ నెలలో ఫ్యూయల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగాయి. దీంతో ఇప్పుడు ధరలు పెరిగాయి. కాగా, కరోనా మహమ్మారి నేపథ్యంలో కోట్లాది మంది ప్రజలకు అండగా ఉండేందుకు కేంద్రం ఎన్నో చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద జూన్ 30వ తేదీ వరకు సిలిండర్ ఉచితంగా అందిస్తోంది.

తెలుగు రాష్ట్రాలు, మెట్రో నగరాల్లో ఎల్పీజీ గ్యాస్ ధరలు
14.2 కిలోల నాన్-సబ్సిడైజ్డ్ ఎల్పీజీ సిలిండర్ (ఇండేన్) ధర ఢిల్లీలో రూ.593, కోల్‌కతా రూ.616, ముంబై రూ.590.50, చెన్నై రూ.606.50గా ఉంది. హైదరాబాద్‌లో రూ.641.00గా ఉంది. విశాఖపట్నంలో రూ.598.50గా ఉంది.
19 కిలోల సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,139.50, కోల్‌కతా రూ.1,193.50, ముంబై రూ.1,087.50, చెన్నై రూ.1,254.00గా ఉంది.

ధరల్లో మార్పు
ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్ రేటు ఆధారంగా ఎల్పీజీ గ్యాస్ ధరలను ప్రతి నెల 1వ తేదీన సమీక్షిస్తాయి కంపెనీలు. రూపాయి-డాలర్ మార్పిడి రేటుపై కూడా ఆధారపడి ఉంటుంది. గ్యాస్ ధరలు గత మూడు నెలల్లో ఏకంగా రూ.862 నుండి రూ.589కి (హైదరాబాద్) తగ్గాయి. ఇప్పుడు రూ.641కి పెరిగింది. ఇప్పుడు ఫ్యూయల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరగడంతో ధరలు పెరిగాయి.


Click it and Unblock the Notifications