ఆరేళ్ల తర్వాత గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు: హైదరాబాద్‌లో ఎంత, రాయితీ ఎంత వస్తుందంటే?
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగిన విషయం తెలిసిందే. సబ్సిడీ లేని సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం రూ.917.50గా ప్రకటించింది. జనవరి నెలలో రూ.769గా ఉన్న సిలిండర్ ధర తాజాగా రూ.148.50 పెరిగింది. ధర పెరిగిన నేపథ్యంలో గృహ అవసరాలకు వినియోగించే సబ్సిడీ సిలిండర్‌కు రాయితీని కూడా పెంచింది. అంటే గ్యాస్ కోసం చెల్లించిన మొత్తంలో రాయతీని పెంచి ఇస్తారు.

అర్హులకు ఇచ్చే రాయితీ రూ.204 నుండి 342
అర్హులకు రాయితీని రూ.204 నుండి రూ.341.95కు పెంచింది కేంద్ర ప్రభుత్వం. అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్, చమురు ధరల ఆధారంగా ప్రతి నెల ఒకటో తేదీన ధరలను నిర్ణయిస్తారు.

ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ధరల నిర్ణయం వాయిదా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి నెల ధర నిర్ణయాన్ని కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. బుధవారం వచ్చిన ఫలితాలతో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగా ధరలని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ధరల పెంపుతో రాయితీ పెంపు
ఏడాదికి తొమ్మిది సిలిండర్ల వరకు కేంద్రం సబ్సిడీ పైన ఇస్తుంది. తాజా ధర పెంపు నిర్ణయంతో కేంద్రం ఇస్తున్న సబ్సిడీ కూడా పెరుగుతుంది. అందుకే సబ్సిడీని రూ.204 నుండి రూ.342కు పెంచింది.

రూ.145 పెంచినా.. వారిపై రూ.6.50 మాత్రమే భారం
చమురు కంపెనీలు సిలిండర్ ధర పెంచిన నేపథ్యంలో ప్రభుత్వం వినియోగదారులపై భారం పడకుండా రాయితీని పెంచడం సబ్సిడీ సిలిండర్ తీసుకునే వారికి ప్రయోజకరం. కంపెనీలు పెద్ద మొత్తంలో ధరలు పెంచినప్పటికీ ఆ మొత్తం వినియోగదారులపై పడటం లేదు. అదనంగా కేవలం రూ.6.50 మాత్రమే పడుతోంది.

హైదరాబాదులో సిలిండర్ ధర.. రాయితీ
హైదరాబాదులో ప్రతి కస్టమర్ సిలిండర్‌కు రూ.917.50 చెల్లించాలి. బుధవారం నుండి ధరలు పెరగడంతో జనవరి నుండి ఫిబ్రవరి 11వ తేదీ వరకు ఉన్న రాయితీ రూ.204 కాగా, ఇప్పుడు ఆ రాయితీ రూ.341.95కు పెరిగింది.

ఆరు నెలలుగా పెరుగుతున్న ధర
గత ఆరు నెలలుగా సిలిండర్ ధర పెరుగుతోంది. సెప్టెంబర్ నెలలో రూ.16, అక్టోబర్‌లో రూ.13.50, నవంబర్‌లో రూ.56.50, డిసెంబర్‌లో రూ.34, జనవరిలో రూ.21, ఫిబ్రవరి నెలలో రూ.148.50 పెరిగింది.

ఆరేళ్లలో ఇదే భారీ పెరుగుదల
కాగా, గత ఆరేళ్లలో సిలిండర్ ధర ఇంతలా పెరగడం ఇదే తొలిసారి. ఈసారి ఏకంగా రూ.145కు పైగా పెరిగింది. 2014 జనవరిలో యూపీఏ హయాంలో సిలిండర్ ధర రూ.220 పెరిగింది. ఆ తర్వాత భారీ పెరుగుదల ఇదే.


Click it and Unblock the Notifications