డిసెంబర్ 1 నుండి దేశవ్యాప్తంగా ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ల ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ ధర సవరణ ప్రక్రియలో భాగంగా వచ్చిన ఈ తగ్గింపు హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ యూనిట్లు, బేకరీలు, ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలు, ఇతర వ్యాపార రంగాలకు స్వల్ప ఉపశమనం కలిగించనుంది. కొత్త ధరలు సోమవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి. ధర తగ్గింపుతో వినియోగదారులు కొంత ఊరట పొందుతున్నప్పటికీ, గృహ వినియోగం కోసం ఉపయోగించే 14.2 కిలోల LPG సిలిండర్ ధరలో మాత్రం ఎటువంటి మార్పు చోటు చేసుకోలేదు.
ఈసారి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.10 తగ్గింది. ఇందుకు ముందు కూడా గత నెలలో రూ.5 వరకు తగ్గింపు జరిగింది. అంటే రెండు నెలల్లో కలిపి వాణిజ్య LPG ధరలు మొత్తం రూ.15 తగ్గాయి. పెరుగుతున్న రవాణా ఖర్చులు, అంతర్జాతీయ ఇంధన ధరల మార్పుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించిన ధరల ప్రకారం.. 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ఢిల్లీలో రూ.1,590.50 నుండి రూ.1,580.50కి తగ్గింది. అలాగే కోల్‌కతాలో ధర రూ.1,694 నుండి రూ.1,684కి తగ్గించబడింది. ముంబైలో కొత్త ధర రూ.1,541.50 స్థాయి నుండి రూ.1,531.50కి తగ్గింది. చెన్నైలో ధర రూ.1,749 నుండి రూ.1,739.50కు తగ్గింది. ఇతర పట్టణాల్లో కూడా ఇదే రేంజ్‌లో ధరలు తగ్గాయి.
ఇక గృహ LPG ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర ఇప్పటికీ రూ.853గానే ఉంది. గత కొన్ని నెలలుగా గృహ LPG ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం గృహ వినియోగదారులపై అదనపు భారాన్ని పెట్టకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా వాణిజ్య LPG ధర తగ్గడంతో హోటల్, రెస్టారెంట్ రంగం కొంత ఉపశమనం పొందనుంది. మహమ్మారి ప్రభావం, పెరుగుతున్న ఆపరేటింగ్ ఖర్చులు, ఆహార వస్తువుల ధరల పెరుగుదల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా రెస్టారెంట్ ఇండస్ట్రీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ సందర్భంలో వంట గ్యాస్ ధరల తగ్గింపు వారికి కొంత ఊరట ఇస్తోంది. దీనివల్ల భోజనాల ధరలను స్థిరంగా ఉంచడానికి లేదా కొంత తగ్గించడానికి అవకాశం ఉంటుంది.
ఇదే సమయంలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు మాత్రం పెరిగాయి. గత నెలతో పోలిస్తే జెట్ ఇంధనం ధర కిలోలీటర్‌కు రూ.777 లేదా 0.8% పెరిగి రూ.94,543.02కి చేరింది. ఇది విమాన టికెట్ ధరలపై ప్రభావం చూపవచ్చని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఎల్పీజీ, ఇతర ఇంధన ధరలు మారుతూనే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, సహజ వాయువు ధరల అనిశ్చితి కారణంగా భవిష్యత్తులో మరిన్ని సర్దుబాట్లు రావచ్చు. అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ తగ్గింపు వ్యాపార రంగానికి కొంత ఊరటను తీసుకువచ్చిందని చెప్పాలి.


Click it and Unblock the Notifications