మీ రెస్టారెంట్ బిల్లుపై LPG ఫీజు వేస్తున్నారా..? వెంటనే ఇలా చేయండి!
మనం బయట హోటల్‌కో లేదా రెస్టారెంట్ కో వెళ్లినప్పుడు సాధారణంగా మెనూలో ఉన్న ధరలను చూసి ఆర్డర్ ఇస్తుంటాం. కానీ, బిల్లు వచ్చేసరికి అందులో రకరకాల పేర్లతో అదనపు ఛార్జీలు దర్శనమిస్తుంటాయి. సర్వీస్ ఛార్జ్ గురించి గతంలోనే పెద్ద రచ్చ జరిగింది. అది వాలంటరీ అని ప్రభుత్వం చెప్పింది. అయితే ఇప్పుడు తాజాగా కొన్ని హోటల్స్ LPG ఛార్జీలు, గ్యాస్ సర్‌ఛార్జ్ లేదా ఫ్యూయెల్ రికవరీ కాస్ట్ అంటూ కొత్త రకం బాదుడు మొదలుపెట్టాయి. దీనిపై సెంట్రల్ కంజ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) సీరియస్ అయ్యింది.

అసలేం జరుగుతోంది?
చాలా హోటళ్లు మెనూలో ఉన్న రేట్ల కంటే అదనంగా, వంటకు ఉపయోగించే గ్యాస్ ఖర్చును కూడా కస్టమర్ల నుంచే వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అంటే, మీరు తినే బిర్యానీ లేదా టిఫిన్ ధరతో పాటు, అది వండటానికి అయిన LPG ఖర్చును విడిగా బిల్లులో యాడ్ చేస్తున్నారన్నమాట. ఇది వినియోగదారులను మోసం చేయడమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలాంటి ఛార్జీలు వసూలు చేయడం 'అన్యాయమైన వాణిజ్య పద్ధతి' (Unfair Trade Practice) కిందకు వస్తుందని CCPA తేల్చి చెప్పింది.
కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి?
వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం, ఏ హోటల్ లేదా రెస్టారెంట్ కూడా కస్టమర్ అనుమతి లేకుండా లేదా డిఫాల్ట్‌గా ఇలాంటి ఇంధన సంబంధిత ఛార్జీలను బిల్లులో వేయకూడదు.
- మెనూ ధరలే ఫైనల్: ఏదైనా ఫుడ్ ఐటమ్ ధరను నిర్ణయించేటప్పుడే దానికి అయ్యే గ్యాస్, కరెంటు, లేబర్ ఖర్చులను కూడా అందులోనే చేర్చాలి.
- అదనపు ట్యాక్స్‌లు మాత్రమే: మెనూలో ఉన్న ధరపై ప్రభుత్వం నిర్ణయించిన GST వంటి పన్నులు మాత్రమే అదనంగా వేయాలి. అంతేకానీ, వంట గ్యాస్ పెరిగింది కాబట్టి బిల్లులో LPG ఫీజు వేస్తామంటే కుదరదు.
ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంది?
నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్‌కు ఈ మధ్యకాలంలో హోటల్ బిల్లులపై విపరీతమైన ఫిర్యాదులు వచ్చాయి. కస్టమర్లకు చెప్పకుండానే బిల్లు చివర్లో ఇలాంటి హిడెన్ ఛార్జీలు వేయడం వల్ల సామాన్యులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇది పారదర్శకతకు విరుద్ధం. వ్యాపారం నిర్వహించడానికి అయ్యే LPG ఖర్చు అనేది యజమాని బాధ్యత, దాన్ని విడిగా వినియోగదారుడిపై రుద్దడం చట్టవిరుద్ధం.
మీరు ఏం చేయాలి?
ఒకవేళ మీరు వెళ్ళిన హోటల్‌లో బిల్లుపై ఇలాంటి అనవసరపు ఛార్జీలు కనిపిస్తే భయపడాల్సిన అవసరం లేదు.
- ప్రశ్నించండి: ముందుగా రెస్టారెంట్ మేనేజర్‌ని కలిసి ఆ ఛార్జీని తొలగించమని అడగండి. ప్రభుత్వ నిబంధనల గురించి వారికి వివరించండి.
- హెల్ప్‌లైన్ నంబర్: వారు వినకపోతే, నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ నంబర్ 1915 కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి.
- ఆన్‌లైన్ ఫిర్యాదు: 'ఇ-జాగృతి' (e-Jagriti) పోర్టల్ ద్వారా లేదా స్థానిక వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించి ఆ హోటల్‌పై చర్యలు తీసుకునేలా చేయవచ్చు.
గుర్తుంచుకోండి, వినియోగదారుడిగా మీ హక్కులను కాపాడుకోవడం మీ బాధ్యత. అనవసరపు బాదుడుకు స్వస్తి పలకండి!


Click it and Unblock the Notifications