ఏడాది లక్షల కోట్ల నష్టం..! ట్రంప్ సుంకాల వల్ల ఏ రంగం ఎక్కువగా దెబ్బతింటుందంటే ?
ఏప్రిల్ నుంచి చాల వరకు దేశాలపై పరస్పర సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన సంగతి మీకు తెల్సిందే. అయితే ఈ హెచ్చరికలు భారతదేశ ఎగుమతి రంగాలలో ఆందోళన వాతావరణాన్ని సృష్టించింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, సిటీ గ్రూప్ రీసెర్చ్ విశ్లేషకులు దీని వల్ల భారతదేశం ఏటా దాదాపు 7 బిలియన్ డాలర్లు నష్టపోవచ్చని చెబుతున్నారు. ప్రభుత్వ అధికారులు ఈ సుంకాలని ఎలా లెక్కిస్తారో అని చూస్తున్నారు. మరోవైపు దానిని ఎదుర్కోవడానికి ప్రణాళికలు కూడా వేస్తున్నారని ఆయన చెప్పారు. అలాగే సుంకాలను తగ్గించడానికి, అమెరికాతో వాణిజ్యాన్ని పెంచడానికి ఒక ఒప్పందంపై కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
అమెరికా సుంకాల వల్ల రసాయన, లోహ ఉత్పత్తులు, ఆభరణాలు, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్ ఇంకా ఆహార ఉత్పత్తుల రంగాలు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని సిటీ గ్రూప్ విశ్లేషకులు అంటున్నారు. గత సంవత్సరం, భారతదేశం నుండి అమెరికాకు ఎగుమతులు దాదాపు 74 బిలియన్ డాలర్లు. వీటిలో ముత్యాలు, విలువైన రాళ్ళు ఇంకా ఆభరణాల ఎగుమతి 8.5 బిలియన్ డాలర్లు. ఇది కాకుండా భారతదేశం 8 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలను అలాగే 4 బిలియన్ డాలర్ల విలువైన పెట్రోకెమికల్స్‌ను అమెరికాకు ఎగుమతి చేసింది. 2023లో అమెరికా నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై భారతదేశం సగటున 11 శాతం సుంకం విధించింది, ఇది అమెరికాలో భారతీయ వస్తువులపై విధించే సుంకం కంటే 8.2 శాతం ఎక్కువ.

అమెరికా నుండి దిగుమతి
2024లో భారతదేశం అమెరికా నుండి దాదాపు $42 బిలియన్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. ఇందులో కలప ఉత్పత్తులపై 7 శాతం, మెషిన్, పాదరక్షలు, రవాణా పరికరాలపై 15 నుండి 20 శాతం & ఆహార పదార్థాలపై దాదాపు 68 శాతం పన్ను విధించబడుతుంది. గత వారం వైట్ హౌస్ విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్ ప్రకారం, వ్యవసాయ వస్తువులపై అమెరికా 5% అత్యంత అనుకూలంగా సుంకం విధిస్తుండగా భారతదేశం 39% సుంకం విధిస్తోంది. అమెరికా మోటార్ సైకిళ్లపై భారతదేశం 100% సుంకం విధిస్తుందని, అమెరికా భారతీయ మోటార్ సైకిళ్లపై 2.4% సుంకం విధిస్తుందని పేర్కొంది.
వ్యవసాయ రంగం
వ్యవసాయ ఉత్పత్తులపై పరస్పర సుంకం విధించాలని అమెరికా నిర్ణయించుకుంటే, దాని వల్ల భారతదేశ వ్యవసాయ ఇంకా ఆహార ఉత్పత్తులపై అతిపెద్ద ప్రభావాన్ని చూపుతుంది. దీనికి కారణం టారిఫ్ వ్యత్యాసం అత్యధికంగా ఉండటం కానీ వాల్యూమ్ తక్కువగా ఉంది. అదేవిధంగా, వస్త్రాలు, తోలు, కలప ఉత్పత్తులు అతి తక్కువ నష్టాన్ని చవిచూస్తాయి. దీనికి కారణం సుంకాల వ్యత్యాసం తక్కువగా ఉండటం లేదా రెండు దేశాల మధ్య వాణిజ్యం పెద్దగా లేకపోవడం. అలాగే, అనేక అమెరికన్ కంపెనీలు ఈ వస్తువులను దక్షిణాసియాలో తయారు చేస్తాయి & భారతదేశం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని సద్వినియోగం చేసుకుంటాయి. దీనితో ఈ వస్తువులను దేశీయ మార్కెట్లో చాలా తక్కువ సుంకానికి అమ్ముతారు.
స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారం, అమెరికా భారతీయ వస్తువులపై ఒకే విధమైన 10 శాతం సుంకం విధిస్తే, భారత ఆర్థిక వ్యవస్థ 50 నుండి 60 బేసిస్ పాయింట్ల నష్టాన్ని చవిచూడవచ్చు. భారతదేశం ఇప్పటికే అనేక వస్తువులపై సుంకాలను తగ్గించింది. ఉదాహరణకు, ఖరీదైన మోటార్ సైకిళ్లపై 50 శాతం నుంచి 30 శాతానికి తగ్గించగా, బోర్బన్ విస్కీపై 150 శాతం నుంచి 100 శాతానికి తగ్గించారు. భారతదేశం ఇతర సుంకాలను కూడా సమీక్షిస్తామని, అమెరికా నుండి ఇంధన దిగుమతులను పెంచుతామని అలాగే మరిన్ని రక్షణ పరికరాలను కొనుగోలు చేస్తామని కూడా హామీ ఇచ్చింది.


Click it and Unblock the Notifications