నలభై రోజుల సుదీర్ఘ లాక్ డౌన్ సమయంలో ఆహారం కోసం, చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఇబ్బందులు పడిన వారి గురించి వింటున్నాం. అయితే ఇదే లాక్ డౌన్ సమయంలో మందు దొరక్క అల్లాడిపోయిన వారు కూడా ఎందరో. అందుకే లిక్కర్ షాప్స్ తెరవగానే నిత్యావసర వస్తువుల దుకాణాల ముందు ఉన్న క్యూ లైన్ కంటే ఎక్కువ లైన్ కనిపించింది. మూడో విడతలో గ్రీన్, ఆరెంజ్ జోన్‌కు చాలా వరకు సడలింపులు ఇవ్వడంతో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి.

ఇంట్లో స్టాక్ పెట్టుకుంటున్న మందుబాబులు
లిక్కర్ షాప్స్ తెరుచుకోవడంతో సోమవారం వైన్ షాప్స్ ముందు మందుబాబులు గంటల తరబడి నిలబడ్డారు. తమకు కావాల్సిన సరుకు కొనుక్కొని వెళ్తున్నారు. ఇదే సమయంలో కొంతమంది మందుబాబులు ముందు జాగ్రత్త తీసుకుంటున్నారు. కరోనా కారణంగా రేపు ఏమవుతుందో అనే ఆందోళన చాలామందిలో ఉంది. కాబట్టి కొంతమంది పెద్ద మొత్తంలో ఇంట్లో స్టాక్ పెట్టుకోవడానికి కూడా కొనుగోలు చేస్తున్నారు.

రూ.95వేలకు పైగా బిల్లు
రూ.52,841 లిక్కర్ బిల్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇదే కాదు మరో రూ.95,347కు సంబంధించిన బిల్లు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది బెంగళూరు డాలర్స్ కాలనీలోని లిక్కర్ షాప్‌కు సంబంధించిన బిల్లుగా చెబుతున్నారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో రూ.45 కోట్ల లిక్కర్ విక్రయం జరిగినట్లు కర్ణాటక ఎక్సైజ్ డిపార్టుమెంట్ వెల్లడించింది. 10 గంటల్లో 3.9 లక్షల బీర్ బాటిల్స్, 8.5 లక్షల లీటర్ల ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ (IMFL) బాటిల్స్ విక్రయించాయి.

రూ.50,000 మించిన బిల్లు
కర్ణాటకలో నిన్న రూ.45 కోట్ల అల్కాహాల్ సేల్స్ జరిగాయట. ఇందులో కొందరు కస్టమర్ల బిల్స్ రూ.50,000కు మించాయి. ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పరిమితికి మించి లిక్కర్ విక్రయించినందుకు గాను బెంగళూరుకు చెందిన లిక్కర్ వ్యాపారిపై ఎక్సైజ్ శాఖ కేసు నమోదు చేసింది. రిటైల్ ఔట్ లెట్స్ కస్టమర్లకు రోజుకు 2.3 లీటర్ల ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ లేదా 18.2 లీటర్ల బీర్ మాత్రమే విక్రయించాలి.
బెంగళూరు తవరకెరె మెయిన్ రోడ్డులోని వ్యాపారిపై కేసు నమోదు చేశామని, ఓ కస్టమర్‌కు రూ.52,841 లిక్కర్ విక్రయినందుకు గాను ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ (బెంగళూరు సౌత్) గిరి చెప్పారు. అతనిపై కర్ణాటక ఎక్సైజ్ యాక్ట్ (చాప్టర్ VII, రూల్ 36) ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. అయితే 8 మంది కలిసి ఈ లిక్కర్‌ను కొనుగోలు చేశారని, వారు సింగిల్ ఏటీఎం/డెబిట్ కార్డు ద్వారా బిల్లు చెల్లించారని, అందుకే ఒకటే బిల్లు ఇచ్చినట్లు చెప్పాడని, దీనిపై విచారణ జరుగుతోందని చెప్పారు. ఈ బిల్లు ప్రకారం అతను 17.4 లీటర్ల ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్, 35.7 లీటర్ల బీర్ అమ్మినట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications