LIC Shares: చాలా కాలం తర్వాత ఎల్ఐసీ షేర్ ఇన్వెస్టర్లకు గుడ్ టైమ్ వచ్చింది. ఐపీవో తర్వాత కుప్పకూలిన స్టాక్ ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ర్యాలీ తర్వాత స్టాక్ 52 వారాల కనిష్ఠ స్థాయి నుంచి 30 శాతానికి పైగా పెరిగింది.
దేశంలోని అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థగా ఉన్న ఎల్ఐసీ షేర్లు వరసగా నాలుగో రోజు సైతం ర్యాలీని కొనసాగించాయి. దీంతో కంపెనీ షేరు ఏడు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. బీఎస్ఈలో ట్రేడింగ్ సమయంలో 4.5 శాతం పెరిగి రూ.690కి చేరుకుంది. జనవరి 27 నుంచి అత్యధిక స్థాయిలో ట్రేడవుతున్నాయి. నేటి పెరుగుదలతో కంపెనీ షేరు 52 వారాల కనిష్ఠ స్థాయి నుంచి 30 శాతం ఎగబాకాయి. అలాగే ఎన్ఎస్ఈలో స్టాక్ ధర 3.33 శాతం మేర పెరిగి 3 గంటల సమయంలో రూ.682 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

ఎల్ఐసీ షేర్లు రూ.949 రేటుకు ఐపీవో సమయంలో ఇన్వెస్టర్లకు కేటాయించబడ్డాయి. అయితే లిస్టింగ్ రోజున ఎన్ఎస్ఈలో స్టాక్ ధర రూ.872 వద్ద లిస్ట్ అయ్యాయి. ఇక బీఎస్ఈలో రూ.867.20 వద్ద అరంగేట్రం చేశాయి. ఆ తర్వాత కొనసాగిన భారీ పతనం తర్వాత.. గడచిన మూడు నెలల కాలంలో స్టాక్ 14 శాతం మేర లాభపడ్డాయి. జూన్ త్రైమాసికంలో కంపెనీ రెండు నాన్-పార్ ఉత్పత్తులను ప్రారంభించింది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తీసుకున్న చర్యలు ప్రస్తుతం సత్ఫలితాలను ఇస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. రానున్న కాలంలో స్టాక్ ధర రూ.917ను చేరుకుంటుందని BUY రేటింగ్ ఇచ్చారు.
గత కొన్ని నెలలుగా తన పెట్టుబడి వ్యూహాలను ఎల్ఐసీ మార్చుకుంది. ఈ క్రమంలో పది నెలల కాలంలో వెల్‌స్పన్ కార్ప్‌లో వాటాను 7.252% నుంచి 5.202 శాతానికి తగ్గించుకుంది. ఈ ఏడాది వెల్‌స్పన్ షేర్లు 45 శాతం లాభపడ్డాయి. అలాగే అదానీ గ్రూప్ కంపెనీల్లో సైతం ఎల్ఐసీ భారీ మెుత్తంలో పెట్టుబడులను పెట్టి భారీగా లాభాలను పొందినట్లు గతంలోనే వెల్లడైంది.


Click it and Unblock the Notifications