LIC Q1 Results: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది భారతీయుల అత్యంత నమ్మకమైన ప్రభుత్వ రంగ సంస్థ. పెట్టుబడుల గురించి అవగాహన లేనివారు సైతం ఈ కంపెనీలో తమ సొమ్మును నమ్మకంగా ఇన్వెస్ట్ చేస్తుంటారు.
ఆగస్ట్ 10న ఎల్ఐసీ తన జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. ఈ క్రమంలో తన పెట్టుబడులపై అధిక ఆదాయంతో నికర లాభం 1,299 శాతం పెరిగి రూ.9,543 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది. దేశీయ ఇన్సూరెన్స్ దిగ్గజం ఏడాది క్రితం ఇదే కాలంలో రూ.682 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా కంపెనీ బాహుబలి లాభాలను నమోదు చేయటంతో ఇన్వెస్టర్లు ఆనందంలో ఉన్నారు.

అలాగే జూన్ 30 నాటికి కంపెనీ స్థూల నిరర్థక ఆస్తులు గత ఏడాది 5.84 శాతం నుంచి భారీగా తగ్గి 2.48 శాతానికి చేరుకున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్-జూన్ FY24 త్రైమాసికంలో పెట్టుబడుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని గమనిస్తే.. గతేడాది రూ.69,570 కోట్ల నుంచి రూ.90,309 కోట్లకు పెరిగింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ వ్యక్తిగత విభాగంలో మొత్తం 32,16,301 పాలసీలను విక్రయించింది. టిక్కెట్ సైజు మోడల్‌లో మార్పు వల్ల పాలసీల సంఖ్య తగ్గుదల ఎక్కువగా ఉందని ఎండీ, సీఈవో సిద్ధార్థ మెుహంతి స్పష్టం చేశారు. రానున్న కాలంలో పాలసీల సంఖ్య పెరుగుతుందని చెప్పారు.
ఈ త్రైమాసికానికి బీమా కంపెనీ మొదటి సంవత్సరం ప్రీమియం 8.3 శాతం తగ్గి రూ.6,810 కోట్లుగా ఉంది. నికర ప్రీమియం ఆదాయం రూ.98,362 కోట్లుగా ఉండగా.. షేర్ హోల్డర్ల ఖాతాల నుంచి కంపెనీ నిధుల బదిలీ రూ.799 కోట్ల నుంచి రూ.1.48 కోట్లకు భారీగా తగ్గింది. ఎల్ఐసీ మెరుగైన లాభాలను నమోదు చేయటంతో నేడు మార్కెట్లో కంపెనీ షేర్లు ఫోకస్ లో ఉన్నాయి. అలాగే 9.42 గంటల సమయంలో షేర్ ధర 2.85 శాతం లాభపడి రూ.660 వద్ద ఎన్ఎస్ఈలో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications