LIC: భారతీయ బీమా రంగంలో ప్రజల నమ్మకాన్ని చూరగొన్న సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC). ఎన్నో ప్రైవేటు కంపెనీలు ఈ విభాగంలో అడుగుపెట్టినా, ఏవీ కనీసం LIC దగ్గరకు కూడా చేరుకోలేకపోయాయి. అటువంటి దిగ్గజ సంస్థ.. ఆర్థిక ఫలితాల్లోనూ సత్తా చాటింది. గురువారం విడుదల చేసిన ఫలితాల్లో పెట్టుబడిదారులకు మంచి లాభాల పంట పండించింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఏకంగా 26 రెట్లు PAT వృద్ధితో అదరగొట్టింది.

భారీ లాభాల్లోకి:
ప్రీమియం ఆదాయం మెరుగుపడటంతో, ఏకీకృత నికర లాభం మూడవ త్రైమాసికం(Q3)లో రూ.8,334 కోట్లకు పెరిగినట్లు LIC ప్రకటించింది. నికర విలువను పెంచుకోవడం కోసం రూ.5,670 కోట్లను వాటాదారుల నిధికి తరలించినట్లు పేర్కొంది. అయితే గతేడాది ఇదే సమయంలో కేవలం రూ.235 కోట్ల లాభాన్ని మాత్రమే నివేదించడం విశేషం. జూలై -సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.15,952 కోట్లు, ఏప్రిల్-జూన్ లో రూ.683 కోట్ల మేర లాభాలు గడించింది. క్రితం ఆర్థిక సంవత్సరం Q3తో పోలిస్తే నికర ప్రీమియం ఆదాయం రూ.97,620 కోట్ల నుంచి రూ.1.11 లక్షల కోట్లకు ఎగబాకింది. అంటే 14.5 శాతం వృద్ధి సాధించిందన్నమాట.

కొత్త కస్టమర్ల విషయంలోనూ కింగే..
డిసెంబరు త్రైమాసికానికిగాను కొత్త వినియోగదారుల మొదటి ఏడాది ప్రీమియం రూ.9,725 కోట్లకు పెరిగింది. గతేడాది ఇది రూ.8,746 కోట్లుగా ఉంది. సింగిల్ ప్రీమియం సైతం రూ.32,190 కోట్ల నుంచి 31% పెరిగి రూ.42,117 కోట్లకు చేరుకుంది. ఇన్వెస్ట్‌మెంట్‌ల ద్వారా వచ్చే నికర ఆదాయం సంవత్సరానికి 11 శాతం వృద్ధితో రూ.84,889 కోట్లకు వెళ్లింది.

ఏజెంట్లే ఆధారంగా..
2022 డిసెంబర్ 31తో ముగిసిన గత 9 నెలల్లో పాలసీల విక్రయాలు YoY 2శాతం పెరిగి 1.29 కోట్లకు చేరుకున్నాయి. దీర్ఘకాలిక రుణాలను తీర్చగల సామర్థ్యం గతేడాదిలో 1.77 ఉండగా ఇప్పుడు 1.85కి పెరిగింది. 19 శాతం మార్జిన్లతో కొత్త వ్యాపారం ద్వారా అంచనా వేస్తున్న వ్యాపారం రూ.7,187 కోట్లకు చేరుకుంది. డిసెంబరు చివరి నాటికి 9 నెలల నిర్వహణ వ్యయం నిష్పత్తి.. అంతకుముందు డిసెంబరులో నమోదైన 14.99 శాతంతో పోలిస్తే 27 బేసిస్ పాయింట్లు పెరిగి 15.26 శాతానికి చేరింది.

భవిష్యత్తు ప్రణాళిక:
LIC నిర్వహణలో ఉన్న ఆస్తులు(AUM) విలువ 10.54 శాతం వృద్ధితో రూ.40.12 లక్షల కోట్ల నుంచి రూ.44.34 లక్షల కోట్లకు పెరిగింది. BSEలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.3.88 లక్షల కోట్లకు చేరుకుంది. "వాటాదారుల పెట్టుబడి విలువను మరింత పెంచడానికి సమర్థవంతమైన పోర్ట్ ఫోలియోలను రూపొందించడంపై దృష్టి సారించాం. స్థిరమైన, లాభదాయకమైన సంస్థల వైపు మొగ్గుచూపుతున్నాం అని ఎల్‌ఐసి చైర్‌పర్సన్ MR కుమార్ ప్రకటించారు.


Click it and Unblock the Notifications