LIC Mutual Funds: ప్రస్తుతం మార్కెట్లలో పెట్టుబడి ట్రెండ్ లను పరిశీలిస్తే.. గడచిన కొన్ని త్రైమాసికాలుగా దేశంలో ప్రజలు తమ డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్లుగా ఉండటం కంటే స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చెయటం ఉత్తమంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది నేరుగా పెట్టుబడుల కంటే మ్యూచువల్ ఫండ్లను ఆశ్రయిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో చిన్న ఇన్వెస్టర్లను సైతం భాగస్వాములుగా చేసుకునేందుకు మ్యూచువల్ ఫండ్ సంస్థలు కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు.
LIC మ్యూచువల్ ఫండ్ పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారులను ఆకర్షించడానికి కనీస రోజువారీ SIP పెట్టుబడి పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.300ను రూ.100కి తగ్గించడాన్ని పరిశీలిస్తోంది. ఇదే క్రమంలో నెలవారీ కనీస SIP పెట్టుబడి మెుత్తాన్ని రూ.1,000 నుంచి రూ.200కి తగ్గించే ప్రణాళికలు ఉన్నాయి. వాస్తవానికి మైక్రో SIP ఇటీవల మార్కెట్లలో భారీగా గుర్తింపును పొందుతున్న సంగతి తెలిసిందే. దేశంలో ప్రతి చిన్న పెట్టుబడిదారుడికి సైతం మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు ప్రాప్యతను మెరుగుపరచడం లక్ష్యంగా తాజా మార్పులు వస్తున్నాయి. రానున్న మూడేళ్లలో కనీస సిప్ మెుత్తాన్ని తగ్గించటం వల్ల ఎక్కువ సంఖ్యలో భాగస్వాములుగా మారుతారని అంచనా వేయబడుతోంది.

దీనిపై ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్, CEO RK ఝా మాట్లాడుతూ AMC రిజిస్ట్రార్ KFintech సర్వీస్‌తో కలిసి పనిచేస్తోందన్నారు. అలాగే కనీస రోజువారీ, నెలవారీ SIP పరిమితిని రూ.100, రూ.200కి తగ్గించడానికి వచ్చే నెల ప్రారంభంలో అనుబంధాన్ని దాఖలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ దశ ఈక్విటీ మార్కెట్ బూమ్ నుంచి ప్రయోజనం పొందని సమాజంలోని వర్గాలను చేరుకోవడానికి ఫండ్ హౌస్‌కి సహాయం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఫండ్ హౌస్ నిర్వహణలో ఉన్న ఆస్తులను ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.35,000 కోట్ల నుంచి రూ.65,000 కోట్లకు, FY26 చివరి నాటికి రూ.లక్ష కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
SEBI నిర్ణయం..
తాజా క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్‌లు(CDS) కొనుగోలు, అమ్మకం రెండింటికీ మ్యూచువల్ ఫండ్‌లను సెబీ అనుమతించింది. కార్పొరేట్ బాండ్ మార్కెట్‌లో లిక్విడిటీని పెంచడం దీని లక్ష్యం. CDSలో పాల్గొనేందుకు ఈ వెసులుబాటు మ్యూచువల్ ఫండ్స్‌కు అదనపు పెట్టుబడి ఉత్పత్తిగా ఉపయోగపడుతుందని సెబీ సర్క్యులర్‌లో పేర్కొంది. క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్‌లు రుణగ్రహీత డిఫాల్ట్ నుంచి రక్షించే బీమా ఒప్పందాల వంటివి. CDS మ్యూచువల్ ఫండ్స్ తమ వద్ద ఉన్న డెట్ సెక్యూరిటీల రిస్క్‌ని నిర్వహించడానికి సహాయం చేస్తుంది. మ్యూచువల్ ఫండ్ ఒక CDSని కొనుగోలు చేసినప్పుడు, నిర్దిష్ట బాండ్ డిఫాల్ట్ నుంచి రక్షణ కోసం బదులుగా విక్రేతకు ప్రీమియం చెల్లిస్తుంది.


Click it and Unblock the Notifications