LIC News: మార్కెట్లో అత్యంత క్లిష్ట పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీ షేర్లను భారీ ధరకు మార్కెట్లోకి తీసుకొచ్చింది. షేర్ ధరను రూ.949గా నిర్ణయించినప్పటికీ చివరికి డిస్కౌంట్ తో రూ.904కి రిటైలర్లకు, పాలసీదారులకు అందించింది.
అయితే ప్రస్తుతం ఎల్ఐసీ షేర్ల ధర ఎన్ఎస్ఈలో రూ.547.30గా ఉంది. ప్రస్తుతం షేర్ మార్కెట్ ధర ప్రకారం ఏప్రిల్ 22, 2023 నాటికి ఎల్ఐసీ మార్కెట్ క్యాప్ రూ.3.46 లక్షల కోట్లుగా ఉంది. దీనికి ముందు మార్కెట్లోకి వచ్చినప్పుడు మే 17, 2022న ఎల్ఐసీ మార్కెట్ విలువ రూ.5.54 లక్షల కోట్లుగా ఉంది. ఇన్సూరెన్స్ వ్యాపారంలో ప్రభుత్వరంగ కంపెనీకి ప్రస్తుతం 63.8 శాతం వాటా ఉంది. దీంతో విలువైన కంపెనీల జాబితాలో ఎల్ఐసీ 13వ స్థానానికి పడిపోయింది.

ఎల్ఐసీ ఐపీవో మార్కెట్లోకి వచ్చినప్పుడు కంపెనీ 5వ విలువైన కంపెనీగా మార్కెట్లో ఉండేది. అప్పట్లో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.5.54 లక్షల కోట్లుగా ఉంది. సెప్టెంబర్ 22, 2022 నాటికి లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారంలో కంపెనీకి 68.25 శాతం వాటా ఉంది. ఇదే క్రమంలో జనవరి 24 హిండెన్ బర్గ్ నివేదిక కు ముందు అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎల్ఐసీ రూ.81 వేల కోట్లు విలువైన పెట్టుబడులను కలిగి ఉంది. అయితే ఏప్రిల్ 22, 2023 నాటికి అదానీ కంపెనీలో రూ.40 వేల కోట్ల పెట్టుబడులను కలిగి ఉంది.
ప్రస్తుతం దేశంలో ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థల హవా పెరుగుతున్న తరుణంలో ఎల్ఐసీ వాటా క్రమేపీ తగ్గుతోంది. ఆరు నెలల కాలంలోనే దాదాపు 4 శాతానికి పైగా వాటాను ప్రభుత్వ రంగ సంస్థ కోల్పోవటం దీనినే సూచిస్తోంది. దీంతో ప్రైవేటు రంగంలోని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, మ్యాక్స్ లైఫ్ క్రమేపీ తమ హవాను పెంచుకుంటూపోతున్నాయి. ఎస్బీఐ లైఫ్ సైతం ఈ పోటీలో నిలిచింది.
మెుత్తానికి ఎల్ఐసీ మార్కెట్లో ఐపీవోగా లిస్ట్ అయ్యిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా రూ.2 లక్షల కోట్ల కంటే ఎక్కువ విలువను కోల్పోయింది. ఇది రిటైల్ ఇన్వెస్టర్ల సంపదను భారీగా క్షీణింపజేసిందని చెప్పుకోవాలి. దీంతో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు నష్టాలకు సైతం తమ వాటాలను ఈ కంపెనీలో అమ్ముకున్నారు. అయితే దీనంతటికీ కారణం ప్రభుత్వం అధిక వ్యాల్యుయేషన్లతో షేర్లను మార్కెట్లోకి తీసుకురావటమేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications