LIC: త్వరలో మార్కెట్లోకి LIC అనుబంధ సంస్థ.. ఛైర్మన్ ఏం చెప్పారంటే..
LIC: ప్రైవేట్ రంగంలో ఎన్ని బీమా కంపెనీలు పుట్టుకొచ్చినా, దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్న పురాతన సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC). భారీ మొత్తంలో కేంద్రానికి డివిడెండ్ ఇస్తూ.. దేశాభివృద్ధిలోనూ తన వంతు పాత్ర పోషిస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు ఓ అనుబంధ సంస్థను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్‌లో భాగంగా ఫిన్‌టెక్ యూనిట్‌ను ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు LIC ఛైర్మన్ సిద్ధార్థ మొహంతి ప్రకటించారు. సంస్థను డిజిటలైజేషన్ చేసేందుకు డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ వాల్యూ ఎన్‌హాన్స్‌మెంట్(DIVE)ని ప్రారంభించినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌ను నడిపించడానికి ఒక కన్సల్టెంట్‌ను కూడా నియమించినట్లు తెలిపారు.

'ప్రాజెక్ట్ DIVE ద్వారా వాటాదారులు, కస్టమర్‌లు, మధ్యవర్తులు, మార్కెటింగ్ వ్యక్తులు సహా ప్రతిఒక్కరికీ అత్యుఉత్తమ డిజిటల్ సేవలు అందించడమే మా లక్ష్యం. కస్టమర్లు ఆఫీసుకు రావలసిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని మొబైల్ ద్వారా అవసరమైన సేవలను పొందవచ్చు. ఫిన్‌టెక్‌పై కూడా మేము దృష్టి పెడుతున్నాం. వ్యాపారాన్ని విస్తరించడంలో దాని సామర్థ్యాన్ని ఉపయోగిస్తాము' అని మొహంతి ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
ప్రారంభించనున్న ఫిన్‌టెక్‌పై మరిన్ని వివరాలను పంచుకోవాలని అడగ్గా.. దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదన్నారు. తమ ఉత్పత్తుల పంపిణీ కోసం ఈ ఏడాది ఇప్పటి వరకు 3 ఫిన్‌టెక్ కంపెనీలను LIC కార్పొరేట్ ఏజెంట్లుగా చేర్చుకుంది. ప్రీమియం వృద్ధిని రెండంకెల మేర వేగవంతం చేసేందుకు 3 కొత్త ప్రొడక్ట్స్‌ను కూడా ప్రారంభించింది.


Click it and Unblock the Notifications