Q4లో LIC హౌసింగ్ రాబడి భేష్.. ఏకంగా 425 శాతం డివిడెండ్ ప్రకటన
LIC Housing: గతేడాది హోమ్ లోన్స్ మంచి పీక్స్ లో ఉన్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా ఆయా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు మంచి లాభాలను పోస్ట్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా LIC అనుబంధ సంస్థ LIC హౌసింగ్ ఫైనాన్స్ (LIC HFL) సైతం మార్చితో ముగిసిన Q4 ఫలితాలను విడుదల చేసింది.
మార్చితో ముగిసిన త్రైమాసికానికి గాను LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నికర లాభం ఏడాదికి 6 శాతం పెరిగి 1,180 కోట్లకు చేరుకున్నట్లు కంపెనీ నివేదించింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయంలో 21 శాతం పెరుగుదల నమోదైనట్లు వెల్లడించింది. తద్వారా రాబడి 6 వేల 415 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది.

ఇక నికర వడ్డీ ఆదాయం 22 శాతం పెరిగి 1,990 కోట్లకు చేరగా.. మార్జిన్ 2.64 నుంచి 2.93 శాతం వద్ద ఉందని HFL ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం చెల్లింపులను గమనిస్తే 19 వేల 315 కోట్ల నుంచి 16 వేల 27 కోట్లకు తగ్గినట్లు పేర్కొంది. ఇందులో వ్యక్తిగత గృహ రుణాల చెల్లింపులే 12 వేల 406 కోట్లు ఉండగా.. ప్రాజెక్ట్ రుణాలు కేవలం 1,554 కోట్లని వివరించింది.
వ్యక్తిగత గృహ రుణ పోర్ట్ ఫోలియో 12 శాతం వృద్ధితో 2 లక్షల 28 వేల 730 కోట్లకు చేరుకుంది. కాగా ప్రాజెక్ట్ లోన్స్ 11 వేల 738 కోట్లకు పడిపోయాయి. మొత్తం పోర్ట్ ఫోలియో పరంగా చూస్తే 9.53 శాతం పెరుగుదల నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కో షేరుకు రూ. 8.50(425 శాతం) డివిడెండ్ ఇవ్వాలని బోర్డు సిఫార్సు చేసింది. రుణ పోర్ట్ ఫోలియో మరియు పంపిణీల సంఖ్యలో స్థిరమైన వృద్ధిని చూశామని, అసెట్ క్వాలిటీ సైతం మరింత మెరుగుపడిందని కంపెనీ MD & CEO విశ్వనాథ గౌడ్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications