LIC News: ప్రభుత్వ రంగ బీమా కంపెనీ ఎల్‌ఐసీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో అదానీ గ్రూప్ కంపెనీల్లో చేసిన పెట్టుబడుల విలువలో 59 శాతం లాభాన్ని తెచ్చి పెట్టింది. యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ సంచలన రిపోర్ట్ షాక్‌వేవ్ నుంచి అదానీ గ్రూప్ స్టాక్స్ కోలుకున్నాయి.
స్టాక్ మార్కెట్ డేటా ప్రకారం ఏడు అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎల్ఐసీ మొత్తం పెట్టుబడి మార్చి 31, 2023 నాటికి రూ.38,471 కోట్ల నుంచి మార్చి 31, 2024 నాటికి రూ.61,210 కోట్లకు పెరిగింది. ఈ పెట్టుబడితో ఎల్ఐసీ ఏకంగా రూ.22,378 కోట్ల విలువ పెరుగుదల నమోదైంది. గత ఏడాది జనవరిలో అదానీ షేర్లలో అవకతకలు జరిగాయంటూ హిండెన్‌బర్గ్ రిపోర్ట్ అదానీ కంపెనీల్లో పెద్ద కుదుపుకు దారితీసింది. గత సంవత్సరం అదానీ గ్రూప్‌లో పెట్టుబడి పెట్టాలనే దాని నిర్ణయంపై ఎల్ఐసీ కూడా ప్రశ్నలు ఎదుర్కొంది. ఈ నివేదిక పూర్తిగా తప్పని అదానీ గ్రూప్ వెల్లడించింది.

రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొని LIC రెండు కీలకమైన గ్రూప్ కంపెనీలలో తన పెట్టుబడిని వ్యూహాత్మకంగా తగ్గించుకుంది. అదానీ పోర్ట్స్ & SEZ, అదానీ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీల షేర్ల ధరలు 83 శాతం, 68.4 శాతం పెరిగాయి. స్టాక్ మార్కెట్ డేటా ప్రకారం పెట్టుబడిని తగ్గించినప్పటికీ LIC 2023-24 ఆర్థిక సంవత్సరంలో అదానీ గ్రూప్‌లో పెట్టుబడులపై 59 శాతం లాభాన్ని ఆర్జించింది.
ఈ కాలంలో విదేశీ పెట్టుబడిదారులు- ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, అబుదాబికి చెందిన IHC, ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ ఎనర్జీ, US-ఆధారిత GQG ఇన్వెస్ట్‌మెంట్స్ అదానీ గ్రూప్ కంపెనీల్లో సుమారు రూ.45,000 కోట్లు పెట్టుబడి పెట్టాయి.
అదానీ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్‌లో ఎల్‌ఐసీ పెట్టుబడి మార్చి 31, 2023 నాటికి రూ.8,495.31 కోట్ల నుంచి ఏడాది తర్వాత రూ.14,305.53 కోట్లకు పెరిగింది. ఇదే కాలంలో అదానీ పోర్ట్స్, సెజ్‌లలో పెట్టుబడులు రూ.12,450.09 కోట్ల నుంచి రూ.22,776.89 కోట్లకు పెరిగాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌లో ఎల్‌ఐసీ పెట్టుబడి ఏడాది వ్యవధిలో రెండింతలు పెరిగి రూ.3,937.62 కోట్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications