LIC News: బీమా దిగ్గజానికి దెబ్బ మీద దెబ్బ.. ఈ సారి తెలంగాణ నుంచి షాక్..
GST News: భారతదేశంలో అగ్రగామి ఇన్సూరెన్స్ కంపెనీగా కొనసాగుతున్న ఎల్ఐసీకి వరుస షాక్స్ తగులుతున్నాయి. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల పన్ను అధికారుల నుంచి ఎగవేతకు సంబంధించిన వరుస నోటీసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే తాజాగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థకు తెలంగాణ పన్ను అధికారుల నుంచి డిమాండ్ నోటీసులు అందాయి. 2017-18 సంవత్సరానికి సంబంధించి జీఎస్టీ చెల్లింపుకు సంబంధించి పన్ను అధికారులు సుమారు రూ.116 కోట్లకు నోటీసులు పంపారు. జనవరి 2న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వడ్డీ మరియు పెనాల్టీ కోసం కంపెనీ కమ్యూనికేషన్/డిమాండ్ ఆర్డర్ స్వీకరించినట్లు ఎల్‌ఐసీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ధృవీకరించింది.

దీనిపై నిర్ణీత గడువులోగా పేర్కొన్న ఆర్డర్‌కు వ్యతిరేకంగా కార్పొరేషన్ హైదరాబాద్ రూరల్ డివిజన్ జాయింట్ కమిషనర్ ముందు బీమా సంస్థ అప్పీల్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి ముందు కొత్త ఏడాదిలో ఎల్ఐసీ సంస్థ మహారాష్ట్ర జీఎస్టీ అధికారుల నుంచి సైతం ఇలాంటి నోటీసులను అందుకుంది. అందులో 2017-18కి సంబంధించిన కాలానికి రూ.806 కోట్లు చెల్లించాలంటూ సోమవారం డిమాండ్ నోటీసులు అందిన సంగతి తెలిసిందే.
తాజా నోటీసులతో కంపెనీ ఆర్థిక, వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి ప్రమాదం ఉండబోదని తెలిపింది. ఇదే క్రమంలో ఎల్ఐసీ ఇటీవలి కాలంలో బీహార్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలకు చెందిన పన్ను అధికారుల నుంచి సైతం నోటీసులను అందుకుంది. అయితే ఇది కంపెనీ లాభదాయకతపై ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇన్వెస్టర్లలో రోజురోజుకూ పెరుగుతోంది. వరుసగా అనేక రాష్ట్రాల నుంచి వస్తున్న పన్ను బకాయి నోటీసులు ఇన్వెస్టర్లను కొంత ఆదోళనకు గురిచేస్తున్నాయి. అయితే వీటిని న్యాయపరంగా ఎదుర్కొంటామని కంపెనీ అధికారులు చెబుతున్నారు. ఆందోళన అక్కర్లేదని వారు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications