LIC News: ఆస్తులు అమ్ముకుంటున్న LIC.. ఈసారైనా ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?
LIC assets for sale: కొత్తగా ఆరోగ్యబీమా రంగంలోకి ప్రవేశించాలని చూస్తున్న భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందుకు అనుగుణంగా 6 నుంచి 7 బిలియన్ డాలర్ల మేర నిధులను రెడీ చేసుకుంటోంది. అయితే వాటి సమీకరణకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టాక్ మార్కెట్ నుంచి కాకుండా మరో మార్గంలో ఈ నిధులను సేకరించాలని చూస్తోంది.
దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ LIC పలు నగరాల్లోని తన ఆస్తులను విక్రయించడం ద్వారా 50 నుంచి 60 వేల కోట్ల మేరకు సమీకరించేందుకు సిద్ధమవుతోంది. త్వరలో ముంబైతో ప్రారంభించి అనేక నగరాల్లో తన ప్లాట్లు మరియు వాణిజ్య ఆస్తులను విక్రయించవచ్చని ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. రక్షణ మరియు రైల్వే రంగాల తర్వాత LIC దేశంలోనే అతిపెద్ద భూమిని కలిగి ఉంది. అనేక నగరాల్లోని ప్రధాన ప్రదేశాలలో ప్లాట్లు మరియు వాణిజ్య భవనాలు LIC సొంతం.

వీటిలో ఢిల్లీ కన్నాట్ ప్లేస్‌లోని జీవన్ భారతి భవనం, కోల్‌కతాలోని చిత్తరంజన్ అవెన్యూలోని LIC భవనం, ముంబైలోని వివిధ భవనాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లో ప్రసిద్ధ హిల్ స్టేషన్ ముస్సోరీలోని SBI బిల్డింగ్ కూడా సంస్థకు చెందినదే. కాగా LIC దేశంలోనే అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారుగా కొనసాగుతుండగా.. 51 లక్షల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి.
నివేదిక ప్రకారం.. LIC ఒక ప్రణాళికపై పనిచేస్తోంది. అంతర్గతంగా అనేక ఆప్షన్స్‌పై చర్చలు జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ ఆస్తులను మానిటైజ్ చేయడాన్ని పరిగణలోనికి తీసుకుంది. గతంలో లెక్కల ప్రకారం సంస్థ స్థిరాస్తి ఆస్తుల విలువ 50 నుంచి 60 కోట్లమేర ఉంది. కాగా ఇప్పుడు ఆస్తుల విక్రయం కోసం వాటి విలువలను తిరిగి మదింపు వేసే అవకాశం ఉంది. అయితే వాటి వాస్తవ విలువ దీనికి 5 రెట్లు ఉండవచ్చని అంచనా. కానీ వాటిని విక్రయించాలంటే LIC చట్టంలో కొన్ని సవరణలు చేయాల్సి ఉంటుంది.
LIC తన స్థిరాస్తులను విక్రయించేందుకు ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఈ తరహా ప్రయత్నాలు జరిగినా అనేక భవనాలపై న్యాయ వివాదాల కారణంగా ఆ ప్లాన్స్ ముందుకు సాగలేదు. కాగా ఇప్పుడు బీమా మార్కెట్‌లోని ప్రైవేట్ కంపెనీలతో పోటీకి సతమతమవుతోంది. కాబట్టి ఆస్తుల విక్రయం ద్వారా సేకరించిన నిధులను కంపెనీ వ్యాపార విస్తరణకు వినియోగించవచ్చని భావిస్తోంది.


Click it and Unblock the Notifications