రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మానిటరీ పాలసీ కమిటీ(MPC) సమావేశం 8న ప్రారంభమై, 10వ తేదీన ముగుస్తుంది. పదో తేదీనే (గురువారం) ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ MPC సమావేశం నిర్ణయాలను ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో ద్రవ్య చలామణి, ద్రవ్యోల్భణం, వడ్డీ రేటు చుట్టూ చర్చ సాగుతోంది. ఓ వైపు కరోనా ఆందోళన తగ్గుతున్న సమయంలో వడ్డీ రేట్లు పెరుగుతాయా? అదే సమయంలో పెరుగుతున్న ద్రవ్యోల్భణం కారణంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ద్రవ్య చలామణిపై ఏ విధంగా ముందుకు వెళ్తారు? అనే అంశాలు కీలకం.

వడ్డీ రేట్లు, ద్రవ్యోల్భణం
ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు ఇచ్చాయి. కొన్ని ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేశాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ వచ్చే నెలలో వడ్డీ రేట్లు పెంచనుంది. ఇదే దిశలో ఆర్బీఐ కూడా పెంచే అవకాశాలు ఉన్నాయా లేదా కనీసం సంకేతాలు ఇస్తుందా అనేది కీలకంగా మారింది.
అయితే కీలక వడ్డీ రేట్లు మరిన్ని నెలల పాటు యథాతథంగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయని ఓ సర్వేలో వెల్లడైంది. కరోనా నుండి కోలుకుంటున్న భారత్ పైన ఒమిక్రాన్ ప్రభావం చూపింది. అయితే ఆర్థిక కార్యకలాపాలు మరీ అంతగా పతనం కాలేదు. ద్రవ్యోల్భణం కూడా భారీగా పెరుగుతోంది. కానీ ఇతర దేశాలతో పోలిస్తే ద్రవ్యోల్భణం కాస్త అదుపులో ఉందని చెబుతున్నారు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరుకోవడంతో ఈ ప్రభావం మనపై పడుతుంది. ఇది ద్రవ్యోల్భణ పెరుగుదలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఏం చేస్తుందనేది చూడాలి.

రివర్స్ రెపో పెంచితే..
వ్యవస్థలో నగదు చెలామణీని తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని ఆర్బీఐ కట్టడి చేసే ప్రయత్నం చేయవచ్చునని, ఈ క్రమంలో రివర్స్ రెపో రేటును పెంచే అవకాశాలు లేకపోలేదనే వాదనలు కూడా ఉన్నాయి. బ్యాంకులు వద్ద ఆర్బీఐ వద్ద పెట్టే డిపాజిట్లకు ఆర్బీఐ చెల్లించే వడ్డీ రేటు రివర్స్ రెపో.
ఆర్బీఐ నుండి బ్యాంకులు తీసుకునే రుణాలకు వసూలు చేసే వడ్డీ రేటునే రెపో రేటు అంటారు. రివర్స్ రెపో పెంపుతో హోమ్ లోన్, వెహికిల్ లోన్ పైన బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు తక్కువ. అయితే టర్మ్ డిపాజిట్ల పైన ఎక్కువ రేట్లను ఇచ్చే అవకాశముంటుంది.
రివర్స్ రెపో రేటును పెంచి, వ్యవస్థలో లిక్విడిటీని ఆకర్షించవచ్చు. తద్వారా నగదు చలామణిని కాస్త తగ్గించవచ్చు. కరోనా నేపథ్యంలో పూర్తిగా సరళీకరించిన ద్రవ్య విధానాన్ని సాధారణ స్థితికి తెచ్చే క్రమంలో తొలి అడుగుగా రివర్స్ రెపోను పెంచవచ్చని భావిస్తున్నారు.

వడ్డీ రేట్లు వరుసగా పెంపు
భారత్ ద్రవ్యోల్భణం కాస్త అదుపులో ఉందని, కాబట్టి వడ్డీ రేటు పెంపుకు ఆర్బీఐకి మరింత సమయం ఉందని కూడా అంటున్నారు. జూన్ లోగా వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రపంచంలోని ఇతర కేంద్ర బ్యాంకుల కంటే ఆర్బీఐ విధానం సరళంగా కొనసాగుతోందని అంటున్నారు. ఫెడ్ రిజర్వ్ మార్చి నుండి వడ్డీ రేట్లను పెంచనుంది. యూరోపియన్ కేంద్ర బ్యాంకులు అదే మార్గంలో నడిచాయి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గతవారమే వడ్డీ రేట్లను రెండోసారి పెంచింది.


Click it and Unblock the Notifications