వాషింగ్టన్: కరోనా మహమ్మారి నేపథ్యంలో అమెరికా గ్రీన్ కార్డులను 60 రోజులు నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో లక్షలాదిమంది H1B వీసా వర్కర్లు ఈ జూన్ నాటికి తమ లీగల్ స్టేటస్ కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం అమెరికా వెళ్లడమే కాదు... అమెరికాలోని విదేశీయులు కూడా ప్రమాదంలోనే ఉన్నారని చెప్పవచ్చు. కానీ డాక్టర్లు, నర్సులు అయితే మాత్రం చాలా సులభంగా అమెరికా వెళ్లవచ్చు. ఇందుకు అనుగుణంగా అమెరికా కాంగ్రెస్ బిల్లును తీసుకు వచ్చింది.

డాక్టర్లు, నర్సులకు తక్షణమే గ్రీన్ కార్డు
అమెరికాలో స్థిరపడటానికి ఈ బిల్లు ద్వారా డాక్టర్లు, నర్సులకు సులభం. ప్రస్తుతం అమెరికా కరోనా కారణంగా తీవ్ర నష్టాన్ని ఎధుర్కొంటోంది. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 2,80,000 మంది చనిపోతే అమెరికాలోనే 80 వేల మరణాలు ఉన్నాయి. 13 లక్షలకు పైగా కేసులు ఉన్నాయి. కరోనా గజగజ వణికిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా చట్టసభ ప్రతినిధులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎవరికీ కేటాయించని దాదాపు 40వేల గ్రీన్ కార్డులను విదేశీ డాక్టర్లు, నర్సులకు తక్షణమే జారీ చేయాలని అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల్లో బిల్లు ప్రవేశ పెట్టారు.

ఇండియన్స్‌కు ప్రయోజనం
ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే 25,000 మంది నర్సులు, 15,000 మంది డాక్టర్లకు గ్రీన్ కార్డులు లభిస్తాయి. అక్కడే ఉండాలనుకునే H1B, J2 వీసాలపై ఉన్న ఇండియన్ డాక్టర్స్, నర్సులకు ఇది ప్రయోజనం. అమెరికాలో వివిధ కంపెనీలలో పని చేసేందుకు H1B వీసాలను మంజూరు చేస్తుంది అగ్రరాజ్యం. కంపెనీలు వేలాదిమంది ఉద్యోగులను తీసుకుంటుంది. చైనా, భారత్ నుండి ఈ వీసా దరఖాస్తులు ఎక్కువగా వస్తాయి.

శాశ్వత నివాసం పొందవచ్చు
గతంలోనే కాంగ్రెస్ ఆమోదించినప్పటికీ జారీ కానీ గ్రీన్ కార్డులను ఇప్పుడు మంజూరు చేయాలని ఈ బిల్లులో పేర్కొన్నారు. అమెరికాలో ఇప్పుడు డాక్టర్లు, నర్సుల కొరత తీవ్రంగా ఉంది. ది హెల్త్ కేర్ వర్క్ ఫోర్స్ రీసైలెన్స్ యాక్ట్ ప్రకారం ఏళ్లుగా వినియోగించకుండా ఉన్న గ్రీన్ కార్డులకు అనుమతిచ్చే అధికారం కాంగ్రెస్‌కు ఉంది. కార్డులను మంజూరు చేయడం ద్వారా అక్కడి పౌరులకు వైద్య సహాయం అందించడంతో పాటు శాశ్వత నివాసం పొందవచ్చు. గ్రీన్ కార్డు అంటే శాశ్వత నివాస ధృవీకరణ పత్రం.


Click it and Unblock the Notifications