బద్ధకం ఖరీదు... రూ 42,69,00,000
పిలిచి పిల్లనిస్తా అంటే... మరేదో అన్నాడంట పెళ్లి కొడుకు. పాత కాలం నాటి సామెత అయినా ఇప్పుడు కూడా బాగా సరిపోతుంది. ఆ... చేద్దాం లే ... చూద్దాం లే అంటే మన కోసం కాలం ఆగుతుందా? కాలం ఏమో కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఆగదు. ఒక ప్రాజెక్టు విషయంలో జరిగిన విపరీతమైన జాప్యం తో కేంద్ర ప్రభుత్వం తాను మంజూరు చేసిన ప్రాజెక్టు ను రద్దు చేసుకోంది. అంతే కాదు తన గ్రాంటుగా రిలీజ్ చేసిన నిధులను కూడా వెనక్కి ఇవ్వాలని రాష్త్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇది కర్ణాటక లో జరిగింది.
కర్ణాటక ప్రభుత్వ బద్ధకం ఖరీదు అక్షరాలా నలభయ్ రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షలు (రూ. 42,69,00,000) కావటం గమనార్హం. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం ఎదురు చూసే రాష్ట్రాలు ఉంటె... ఇక్కడేమో ఇచ్చిన నిధులనే ఖర్చు చేయలేని వింత పరిస్థితి. 2015 లో మంజూరు ఐన ఒక ప్రాజెక్టును ఏర్పాటును జాప్యం చేస్తూ కనీసం ఇప్పటి వరకు దానిపై ఎలాంటి పురోగతి చూపలేదు. నిజానికి ఆ ప్రాజెక్టు రెండేళ్ల క్రితమే పూర్తి కావాల్సింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చూపిన నిర్లక్ష్య వైఖరితో కేంద్రం విసిగి పోయింది. అందుకే ప్రాజెక్టును రద్దు చేసుకోవటమే కాకుండా మంజూరు చేసిన నిధులను వెనక్కి ఇవ్వాలని కోరింది. అది కూడా పెనాల్టీ లతో సహా. ఈ మేరకు బెంగళూరు మిర్రర్ లో ఒక కథనం ప్రచురితమైంది. దాని ఆధారంగా మీ కోసం కొన్ని విషయాలు.

2015 ప్రాజెక్టు మంజూరు..
కర్ణాటకలోని దేవనహళ్లి లోని ఏరోస్పేస్ పార్కులో ఏరోస్పేస్ కామన్ ఫినిషింగ్ ఫెసిలిటీ (ఏసీఎఫ్ఎఫ్) ఏర్పాటు చేసేందుకు కేంద్ర వాణిజ్య - పరిశ్రమల శాఖ అనుమతి మంజూరు చేసింది. రూ 90.50 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టాల్సి ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ 42.69 కోట్లు కర్ణాటక రాష్ట్రానికి మంజూరు చేసారు. ఇప్పటికే రూ 12.80 కోట్ల నిధులను మంజూరు చేసారు. ఈ ప్రాజెక్టు వస్తే ఏరోస్పేస్ రంగంలో అనేక చిన్న పరిశ్రమలు ఏర్పాటై... స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యేవి. 2015 ఆగష్టు లో మంజూరు ఐన దీనిని నిబంధనల ప్రకారం 2017 ఆగష్టు 9 నాటికి పూర్తిచేయాల్సి ఉంది. కానీ 2018 ఫిబ్రవరి లో మాత్రమే దీనికి భూమి పూజ చేసి అధికారికంగా పనులు ప్రారంభించారు. అప్పటి కేంద్ర పరిశ్రమల మంత్రి దీనిని శంకుస్థాపన్ చేసి ప్రారంభించారు. కానీ అక్కడి నుంచి మళ్ళీ పురోగతి లేదు.

42 ఎకరాల నుంచి 5 ఎకరాలకు...
ప్రాజెక్టు రాకతో స్థానికంగా చిన్న పరిశ్రమల ఏర్పాటు జరుగుతుందని, ఇది మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని భావించారు. అందుకే ఈ ప్రాజెక్టు కోసం రూ 42.50 ఎకరాల భూమిని కేటాయించారు. కానీ అక్కడి కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ బోర్డు దీనిపై పిల్లి మొగ్గలు వేయటం ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు నోడల్ ఏజెన్సీ గా ఉన్న ఈ బోర్డు పలు మార్లు ప్రాజెక్టుకు కేటాయించిన భూమిని తగ్గిస్తూ వెళ్ళింది. ఒక సారి 10 ఎకరాలతో సరిపుచ్చితే... చివరకు దాన్ని 5 ఎకరాలకు కుదించింది. ఒకవైపు ప్రాజెక్టు నిర్మాణంలో పురోగతి లేకపోవటం... మరో వైపు దానికి కేటాయించిన భూమిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటంతో మొత్తానికి ప్రాజెక్ట్ హీటెక్కిపోయింది.

అందుకే ఇవ్వలేం...
ప్రాజెక్టు మంజూరు చేసి మూడున్నరేళ్లు గడుస్తున్నా పురోగతి లేదు. సంబంధిత స్కీం లో భాగంగా ఈ ప్రాజెక్టుకు నిధులను మంజూరు చేయటం 2019 మర్చి 31 నాటికే కుదురుతుంది. ఈ ఏడాది బడ్జెట్ లో దీనికి నిధులు కేటాయించలేదు. అందువల్ల ఇకపై ఈ ప్రాజెక్టు కోసం మరింత సమయాన్ని కేటాయించినా అది ఏ రకంగా కూడా పనికి రాదు అని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రి అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డిపిఐఐపి) డెవలప్మెంట్ ఆఫీసర్ ఎస్ కే జైన్ ఈ ఏడాది మర్చి లో కర్ణాటక ప్రభుత్వానికి ఒక లేఖలో వివరించారు. అదే సమయంలో ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం విడుదల చేసిన రూ 12.80 కోట్ల నిధులను పెనాల్టీలతో సహా తమకు చెక్కు లేదా డీడీ రూపంలో చెల్లించాలని ఆదేశించారు. దీంతో కర్ణాటక ప్రభుత్వ నిర్లక్ష్యం, బద్ధకం తో రాష్ట్రంలో వందలాది చిన్న పరిశ్రమల ఏర్పాటు ప్రశ్నర్ధాకంలో పడిందని అక్కడి పరిశ్రమల సమాఖ్య ఆరోపించింది.


Click it and Unblock the Notifications