Hyderabad Realty: ప్రజల ఆదాయాలకంటే వేగంగా ఖర్చులు పెరుగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో జనవరి-మార్చి త్రైమాసికంలో అద్దెలు భారీగానే పెరిగాయి. ప్రధానంగా హైదరాబాద్, నోయిడా, గురుగ్రామ్, ముంబై, బెంగళూరుల్లో అద్దెలు రికార్డు స్థాయిల్లో పెరిగాయని మ్యాజిక్‌బ్రిక్స్ ఇచ్చిన తాజా రిపోర్టులు వెల్లడించాయి.
మార్కెట్లో నెలకొన్న డిమాండ్-సరఫరా అంతరాల కారణంగా అద్దెల్లో స్థిరమైన పెరుగుదల ఇటీవలి నెలల్లో నమోదైంది. ఐటీ హబ్‌లు చెన్నై (14.3 శాతం), బెంగళూరు (12.2 శాతం), హైదరాబాద్ (10.8 శాతం), పుణె (7.8 శాతం) అద్దె డిమాండ్‌లో అత్యధిక వృద్ధిని నమోదు చేశాయి. ప్రస్తుతం ఇండియన్ రెంటల్ హౌసింగ్ మార్కెట్ మంచి పునరుద్ధరణను ప్రదర్శిస్తోందని మ్యాజిక్‌బ్రిక్స్ CEO సుధీర్ పాయ్ అన్నారు.

దక్షిణాదిలోని నగరాలు దేశం నలుమూలల నుంచి ప్రతిభావంతులను ఆకర్షిస్తున్నందున రియల్టీ రంగంలో అద్దె గృహాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నగరాల్లో 2BHKల కోసం 42 శాతం, 3BHKలకు 36 శాతం, 1BHK గృహాలకు 17 శాతం డిమాండ్ ఉన్నట్లు వెల్లడైంది.
విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాదు నగరంలో గత ఏడాది జనవరి నుంచి మార్చి మాధ్య కాలం 2BHKల అద్దెలను పరిశీలిస్తే.. హైటెక్ సిటీలో అద్దెలు రూ.24,000 నుంచి 12 శాతం పెరిగి రూ.26,800కి చేరుకున్నాయి. గచ్చిబౌలి ప్రాంతంలో అద్దెలు 11 శాతం పెరగటంతో రూ.23,000 నుంచి రూ.25,600కి చేరుకున్నాయి. అలాగే కొండాపూర్ ప్రాంతంలో అద్దెలు 12 శాతం పెరగగా రూ.21,500 స్థాయి నుంచి రూ.24,000కి పెరిగాయి.


Click it and Unblock the Notifications